సీవోఏ తొలి షాక్: టీమిండియా మీడియా మేనేజర్ రాజీనామా
హైదరాబాద్: అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పదవులను పొందిన వారికి బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ (సీవోఏ) సోమవారం షాకిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో జనవరి 30 నుంచి బాధ్యతలు చేపట్టిన వినోద్ రాయ్ నేతృత్వంలోని సీవోఏ న్యూఢిల్లీ, పూణెలోని ఆఫీసులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఢిల్లీలో ఫిబ్రవరి 1న మాజీ కాగ్ వినోద్‌రాయ్, ఐడీఎఫ్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ లిమాయె, మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జి, చరిత్రకారుడు రామచంద్ర గుహాతో కూడిన నూతన పాలకుల కమిటీ సమావేశం అయింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే కార్యాలయ అధికారులపై వేటు వేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
ఇకపై తమ అనుమతితో నాలుగు నెలల పదవీకాలంతో కొత్తవారిని నియమించే బాధ్యతను కమిటీ బీసీసీఐ సీఈవో రాహుల్ జోరీకీ అప్పగించింది. ఇప్పటివరకు విధులు నిర్వహిస్తున్న టీమిండియా మీడియా మేనేజర్ నిషాంత్ అరోరా రాజీనామా చేశాడు. అతడి రాజీనామాను ఆమోదించిన సీవోఏ, ముంబైలోని క్రికెట్ హౌస్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించింది.
గత 18 నెలలుగా బీసీసీఐ మీడియా మేనేజర్‌గా నిషాంత్ అరోరా ఉన్నారు. ఈ క్రమంలో టీమిండియా జట్టు వెంట ఆస్ట్రేలియా, అమెరికా, వెస్టిండిస్ పర్యటనలకు సైతం వెళ్లాడు. కాగా, టీమిండియా డ్రస్సింగ్ రూమ్ రహస్యాలను నిషాంత్ అరోరా బయటకు చేరవేస్తున్నట్టు సీనియర్ ఆటగాళ్లు ఫిర్యాదు చేసిన మరుసటి రోజునే అతడు రాజీనామా చేయడం విశేషం.

ఠాకూర్‌కు డ్రస్సింగ్ రూమ్ రహస్యాలు
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనురాగ్ ఠాకూర్‌కు జట్టు డ్రస్సింగ్ రూమ్ రహస్యాలు చేరవేస్తున్నాడని, అతడి ప్రవర్తన తమకు ఇబ్బంది కలిగించేలా ఉందని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సీనియర్ ఆటగాడు అసహనం
మీడియా మేనేజర్ మా సౌలభ్యం కోసమా? లేక చికాకు పెట్టడానికా? అని ఓ సీనియర్ ఆటగాడు అసహనం వ్యక్తం చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ విషయాలు బయటకు పొక్కుతుండడంతో ఆటగాళ్ల మధ్య అపనమ్మకం పెరుగుతోందని ఆ క్రికెటర్ అన్నాడట.

వార్నింగ్ ఇచ్చిన సీనియర్ ఆటగాడు
‘మీడియా వ్యవహారాలను చూసుకోవడమే మీడియా మేనేజర్ పని. కానీ అరోరా అన్ని విషయాల్లోనూ తలదూరుస్తున్నాడు. తుది జట్టును ఖరారు చేసే సమయంలో జరిగే చర్చల గురించి కూడా ఆరాతీస్తున్నాడు' అని ఆ సీనియర్ ఆటగాడు చెప్పాడు. అమెరికాలో వెస్టిండిస్ టీ20 మ్యాచ్ సందర్భంగా అరోరా.. తనకు, కోచ్‌కు మధ్య విభేదాలు రగిల్చే ప్రయత్నం చేశాడని ఆ సీనియర్ ఆటగాడు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడట.

టీమిండియాకు మీడియా మేనేజర్
అనురాగ్ ఠాకూర్ హయాంలో బీసీసీఐ అధ్యక్ష కార్యాలయంలో అరోరాను ఎగ్జిక్యూటివ్‌గా నియమించారు. ఆ తర్వాత టీమిండియాకు మీడియా మేనేజర్‌ను చేశారు. అనురాగ్ అధ్యక్షుడిగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం అ కౌంట్లను నిషాంత్ అరోరా కంపెనీ ఫైనల్ స్కోర్ మేనేజ్‌మెంట్ సంస్థ చూడటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications