
న్యూఢిల్లీ: భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరికి క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)లో ఇటీవల జరిగిన సమావేశాలకు అమితాబ్ చౌదరి హాజరు కాకపోవడంతో సీఓఏ నోటీసులు పంపింది. షోకాజ్ నోటీసుపై స్పందించడానికి చౌదరికి ఏడు రోజులు సమయం కూడా ఇచ్చింది.
జూలై 14-20న ఐసీసీ సమావేశం లండన్‌లో జరిగింది, ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 3న బ్యాంకాక్‌లో జరిగింది. ఈ రెండు సమావేశాలకు బీసీసీఐ ప్రతినిధిగా అమితాబ్ చౌధురి హాజరుకాలేదు. దీంతో ఐసీసీ యొక్క బోర్డు సమావేశంలో బీసీసీఐ ప్రాతినిధ్యం వహించలేదు. ఆగ్రహించిన సీఓఏ షోకాజ్ నోటీసులు జారీ చేసి.. ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
'ఐసీసీ, ఏసీసీ సమావేశాలకు మీరు హాజరుకాలేదు. బీసీసీఐ తరఫున ఈ సమావేశాలకు ప్రాతినిధ్యం వహించలేదు. ఐసీసీ జూలై 14-20న సమేవేశాలు నిర్వహించింది. జూలై 12న మీరు అందుబాటులో ఉండడం లేదని ఈ మెయిల్ చేశారు. ఏసీసీ సమావేశానికి కూడా హాజరుకాలేదు. సీఓఏకు సమాచారం అందించాలని మీరు బావించట్లేదు. దీనిపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని' సీఓఏ లేఖలో పేర్కొంది. జాతీయ ఎంపిక కమిటీ సమావేశాలకు అమితాబ్ హాజరుకాకుండా సీఓఏ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.