హైదరాబాద్: లోథా కమిటీ ఇచ్చిన సిఫారసులు అమలు చేయలేదనే కారణంతో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేను సుప్రీం తొలగించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఉపాధ్యక్షుల్లో సీనియర్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా నామినేట్ చేయమని సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించిన తీర్పులో పేర్కొంది.
కోర్టు ఆదేశాల ప్రకారం ఉపాధ్యక్షుల్లో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు ఎవరూ తీసుకుంటారనే దానిపై చర్చ మొదలైంది. బోర్డులో మొత్తం ఐదుగురు ఉపాధ్యక్షులు ఉన్నారు. వీరిలో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ అసోసియేషన్ (డీడీసీఏ) అధికారి సీకే ఖన్నా అందరిలో సీనియర్. సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖన్నా మూడోసారి ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడు.
అయితే ఖన్నా క్రికెట్‌కు చాలా హానికరమైన వ్యక్తి అని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ అసోసియేషన్ గొడవల సందర్భంగా ఖన్నాపై డీడీసీఏ పర్యవేక్షకుడు జస్టిస్ ముకుల్ ముద్గల్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఈ నివేదిక ఖన్నా ఎంపికకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఖన్నా తర్వాత అసోం క్రికెట్ సంఘం అధ్యక్షుడు గౌతమ్ రాయ్ ఉన్నారు.

వెస్ట్‌జోన్‌కు చెందిన గౌతమ్ రాయ్ రెండోసారి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. రాయ్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రాయ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అసోం క్రికెట్‌లో ప్రతికూల పరిణామాలు సంభవించాయని డెలాయిట్ ఓ నివేదికలో పేర్కొంది. అంతేకాదు వీరిద్దరూ కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లోకి వస్తారు.
వీరిద్దరి తర్వాత గోకరాజు గంగరాజు కూడా కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లోకి వస్తారు. గత పది సంవత్సరాలుగా గోకరాజు గంగరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో లోధా కమిటీ సిఫారసుల మేరకు ఐదుగురు ఉపాధ్యక్షులు అనర్హతకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.