భారత క్రికెట్ వ్యవస్థను గాడినపెట్టేందుకు బీసీసీఐ 10 పాయింట్లతో కూడిన నియమావళిని రూపొందించిందని గత వారం రోజులుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఆ నిబంధనలను అమలు చేయడం ప్రారంభించినట్లు తెలిసింది.
ఇందులో భాగంగా బీసీసీఐ.. జట్టు ఆటగాళ్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించిందని తెలిసింది. ప్లేయర్స్ ఎవరికి కూడా వ్యక్తిగత వాహనాలను సమకూర్చకుండా, ఆటగాళ్లంతా కలిసి ఒకే బస్సులోనే ప్రయాణించేలా ఏర్పాటు చేస్తుందని సమాచారం అందింది. ''ప్రాక్టీస్ సెషన్ పూర్తయ్యే వరకు ప్లేయర్స్ అంతా మైదానంలోనే ఉండాలి. అక్కడి నుంచి హోటల్‌కు కలిసే వెళ్లాలి'' అని బీసీసీఐ నియమావళి రూపొందించింది. ఈ మేరకు.. ఇంగ్లాండ్ సిరీస్ కు ఆతిథ్యమివ్వనున్న రాష్ట్ర క్రికెట్ బోర్డు సంఘాలకు ఆదేశాలను జారీ చేసినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇప్పటికే ఈ ఆదేశాలను తొలి టీ20కు (కోల్‌కతా వేదిక) ఆతిథ్యమిస్తున్న బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అమలు చేసింది. ఈ తొలి టీ20 మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లాండ్ జట్లు అక్కడికి చేరుకున్నాయి. అయితే మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేసిన ప్లేయర్స్, సహాయక సిబ్బంది అంతా.. హోటల్ నుంచి ఒకే బస్సులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలోనూ అదే బస్సులో హోటల్ కు వచ్చారు.
''భారత జట్టు కోసం ఒక బస్సును మాత్రమే అందుబాటులో ఉంచాం. ఎవరికీ కూడా వ్యక్తిగత వాహనాలు సమకూర్చలేదు. ఒకే బస్సులో ప్రయాణించాలనే నిబంధనకే కట్టుబడి ఉన్నాం'' అని బెంగాల్ క్యాబ్ అధ్యక్షుడు స్నేహాశీష్ గంగూలీ వెల్లడించారు.