బంగ్లాదేశ్ క్రికెట్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరునంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్, ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ నజ్ముల్ ఇస్లాంను పదవి నుంచి తొలగిస్తూ బీసీబీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆటగాళ్ల సమ్మె హెచ్చరికలు, బీపీఎల్ మ్యాచ్ బహిష్కరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.తమీమ్ ఇక్బాల్‌ను "భారత ఏజెంట్" అని సంబోధించిన మరుసటి రోజే నజ్ముల్ ఇస్లాంను బీసీబీ తన బాధ్యతల నుండి తొలగించడం గమనార్హం.
వివాదానికి కారణం ఏమిటి?
బంగ్లాదేశ్ తరపున 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టీ20లు ఆడిన దిగ్గజ ఆటగాడు తమీమ్ ఇక్బాల్‌ను ఉద్దేశించి నజ్ముల్ ఇస్లాం అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (CWAB) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా డొమెస్టిక్ మ్యాచ్‌లను బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అత్యవసర ఆన్‌లైన్ సమావేశం నిర్వహించి నజ్ముల్‌ను పదవి నుంచి తొలగించాలని నిర్ణయించింది.

ప్రభుత్వ స్పందన
బంగ్లాదేశ్ యువజన మరియు క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నజ్ముల్ కామెంట్స్ వృత్తిపరమైన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు."జాతీయ గౌరవం విషయానికి వస్తే క్రికెట్ బోర్డు, ఆటగాళ్లు, అభిమానులు అందరూ ఐక్యంగా ఉంటారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి క్రికెటర్లను అవమానించడం అత్యంత దురదృష్టకరం. ముస్తాఫిజుర్ వంటి ఆటగాడిని అవమానించినప్పుడు దేశమంతా ఏకమై నిరసన తెలిపింది. అలాంటి సమయంలో ఒక బోర్డు డైరెక్టరే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం," అని ఆసిఫ్ నజ్రుల్ పేర్కొన్నారు.
నిరసన సెగలు
ఈ వివాదం కారణంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌పై ప్రభావం పడింది. చిట్టగాంగ్ రాయల్స్, నోవాఖలీ ఎక్స్‌ప్రెస్ జట్లు గురువారం జరగాల్సిన మ్యాచ్‌కు హాజరు కాలేదు. ఢాకా క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు కూడా ఈ నిరసనల వల్ల ప్రభావితమయ్యాయి.
ప్రస్తుత పరిస్థితి
నజ్ముల్ ఇస్లాం స్థానంలో ఫైనాన్స్ కమిటీ యాక్టింగ్ చైర్మన్‌గా బీసీబీ ప్రెసిడెంట్ మొహమ్మద్ అమీనుల్ ఇస్లాం వ్యవహరిస్తారు. ఆటగాళ్ల ప్రయోజనాలకే తమ మొదటి ప్రాధాన్యత అని బీసీబీ స్పష్టం చేసింది.