సాధారణంగా క్రీడలన్నాక మైదానంలో చిన్నపాటి లేదా భారీ స్థాయిలో అనుకోని ప్రమాదాలు జరగడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా క్రికెట్ లో ఇలాంటివి తరచుగా వింటుంటాం. క్రికెటర్లు తీవ్రంగా గాయపడటం, లేదంటే బంతి తగిలి మరిణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా బాధ కలిగించే సంఘటన మరొకటి చేసుకుంది. కానీ ఈ సారి మాత్రం బంతి తగిలి ఓ అరుదైన జాతి పావురం చనిపోయింది. దీనిపై క్రికెట్ అభిమానులతో పాటు మైదానంలో ఉన్న క్రికెటర్లు, ఆడియెన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే
ప్రస్తుతం బీబీఎల్ 2025 జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మెల్ బోర్న్ వేదికగా మెల్ బోర్న్ స్టార్స్, సిడ్నీ సిక్సర్ మధ్య జరిగిన మ్యాచ్ లోనే ఈ హృదయాన్ని బాధపెట్టే సంఘటన చోటు చేసుకుంది. ఈ పోరులో 158 పరుగల లక్ష్య ఛేదనలో భాగంగా సిడ్నీ సిక్సర్ జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఇన్నింగ్స్ 10 ఓవర్ ను లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జోయెల్ ప్యారిస్ బౌలింగ్ చేయగా.. క్రీజులోకి జేమ్స్ విన్స్ వచ్చి బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే ఇదే ఓవర్ లో ఐదో బంతిని విన్స్ బలంగా బౌండరీ దిశగా షాట్ బాదాడు.

బంతి అమాంతం గాల్లోకి లేసి బౌండరీ లైన్ తాకింది. కానీ అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద సీ గల్ జాతికి చెందిన పావురాలు ఉన్నాయి. బంతి దెబ్బకి అన్నీ గాల్లోకి ఎగరగా ఓ పావురానికి మాత్రం బంతి బలంగా తాకింది. దీంతో సీ గల్ అక్కడికక్కడే రెక్కలు ఊడిపోయి కుప్పకూలిపోయింది. కాసేపు కిందపడి విలవిలలాడింది. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి దాన్ని వెంటనే బయటకు తీసుకెళ్లారు. కానీ అంతలోనే అది చనిపోయినట్లు తెలిసింది.
ఈ సంఘటనతో ఒక్కసారిగా మైదానంలో అక్కడే ఉన్న కామెంటేటర్స్, ప్రేక్షకులు, బంతిని బాదిన విన్స్ అంతా షాక్ అయ్యారు. పావురం మృతి పట్ల సంతాపం తెలిపారు. అయితే ఆస్ట్రేలియాలో మ్యాచ్ జరిగేటప్పుడు ఇలాంటి సంఘటన జరగడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలానే జరిగిందట. ఆస్ట్రేలియాలో సీ గల్స్ డిసెంబర్ - జనవరి నెలలో గుంపులు గుంపులుగా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తుంటాయి. దీంతో మెల్ బోర్న్ స్టేడియంలో మ్యాచ్ జరిగేటప్పుడు క్రికెటర్లు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఓ సారి మెల్ బోర్న్ లో మ్యాచ్ జరిగేటప్పుడు సీ గల్ అడ్డు రావడం వల్ల క్రికెటర్ బెన్ డకెట్ ఓ ఈజీ క్యాచ్ ను మిస్ చేసుకున్నాడట.