
హైదరాబాద్: జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని వింతలు చూస్తుంటాం. తాజాగా అలాంటి వింతే ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా అడిలైడ్ ఓవెల్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, హోబర్ట్ హర్రికేన్స్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే అడిలైడ్ స్ట్రైకర్స్ ఓపెనర్ జేక్ వెథరాల్డ్‌ను బౌలర్ జోఫ్రా ఆర్చర్ విచిత్రంగా రనౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ ఓపెనర్లు అలెక్స్ కారీ(100), జేక్ వెథరాల్డ్(65) తొలి వికెట్‌కి 171 పరుగులు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
అయితే ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసేందుకు ఆర్చర్ బంతిని అందుకున్నాడు. ఆర్చర్ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ గట్టిగా బాదాడు. అయితే గాల్లోకి అమాంతం ఎగిరి ఆ బంతిని అందుకున్న ఆర్చర్ కిందపడిపోయాడు. అయితే కిందపడినప్పటికీ బంతితో వికెట్లకు గిరాటేశాడు.
దీంతో షాక్‌కి గురైన బ్యాట్స్‌మెన్ పరుగు తీయకుండానే వెనక్కి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు సెంటర్ పిచ్‌లో ఉండటంతో ఎవరు ఔట్ అనే విషయమై ఫీల్డ్ అంఫైర్లు థర్డ్ అంఫైర్‌కు నివేదించారు. దీంతో వీడియో పుటేజిని పరిశీలించిన థర్డ్ అంఫైర్ బ్యాట్స్‌మెన్ వీథర్లాడ్‌ని ఔట్‌గా ప్రకటించాడు.
భారీ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసిన ఆర్చర్‌ను జట్టు సభ్యులు అభినందించారు. ఇదిలా ఉంటే అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఆర్చర్ 3 వికెట్లు తీసి 27 పరుగులిచ్చాడు.
అయితే అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హర్రికేన్స్ నిర్ణీత ఓవర్లలో 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.