Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ కు గడ్డు కాలం నడుస్తోంది. అన్ని ఫార్మాట్లలో వరుస ఓటములతో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. జట్టు ప్రక్షళన చేస్తోన్న కూడా, ఆటగాళ్లను మారుస్తోన్న కూడా ఫలితం దక్కట్లేదు. టీ20 వరల్డ్ కప్ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చెత్త ప్రదర్శన చేసిన ఆ జట్టు.. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఆడిన టీ20, వన్డే సిరీస్‌లోనూ ఘోర పరాజయాన్ని అందుకుంది. దీంతో సొంత దేశ క్రికెట్ మాజీలే.. పాక్ జట్టుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాక్ జట్టు ఫ్లాప్ షోను ఊద్దేశిస్తూ.. మరోసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, సెలక్షన్ కమిటీపై ప్రశ్నల వర్షం కురిపించాడు పాక్ మాజీ క్రికెటర్ బాసత్ అలీ. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క ఫ్రంట్ లైన్ స్పిన్నర్‌తో ఆడటం ఏంటని ప్రశ్నించాడు. ప్రస్తుత కోచ్ ఆకిబ్ జావేద్‌ను.. తన బాధ్యతల నుంచి తప్పించాలని పేర్కొన్నాడు.

మీ కన్నా వారే నయం..
"సెలక్షన్ కమిటీ రిజైన్ చేయాలి. వారికి జట్టును ఎలా తీర్చిదిద్దాలో, జట్టు కూర్పును ఎలా సెట్ చేయాలో తెలీదు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇప్పటి వరకు ఫ్లాప్ షో చేస్తూనే ఉన్నారు. టమాటాలు అమ్ముకునే వారికి కూడా మీ కన్నా ఎక్కువ పరిజ్ఞానమే ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో స్పిన్నర్లను ఎందుకు తీసుకోలేదని వారు కూడా అడుగుతున్నారు" అని బాసత్ అలీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
అందులో నిజం లేదు...
ఇదే సమయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతోన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటారని వార్తలు వస్తోన్నాయి. తాజాగా ఈ విషయమై పీసీబీ స్పందించింది. అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది.