బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ తరఫున ఇద్దరు కుర్రాళ్లు అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ తొలిసారి బ్లూజెర్సీ ధరించుకున్నారు. అయితే పేస్ సంచలనం మయాంక్ యాదవ్ గురించే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు చర్చిస్తున్నారు. అతని వేగం, వైవిధ్యం, కట్టుదిట్టమైన బంతులను కొనియాడుతున్నారు.
తాజాగా ప్రశంసల కురిపిస్తున్న మాజీ ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ మాజీ బ్యాటర్ బసిత్ అలీ కూడా చేరాడు. మయాంక్ యాదవ్ బౌలింగ్ నైపుణ్యాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు. వచ్చే నెల ఆఖర్లో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా పర్యటనలో ఈ కుర్రాడిని జట్టులో చేర్చాలని టీమిండియా సెలక్టర్లకు బసిత్ అలీ సూచించాడు. ప్రత్యర్థులకు అతను భయాన్ని కలిగిస్తున్నాడని, ఫ్రంట్ ఫూట్‌తో ఆడటానికి బ్యాటర్లు సంశయిస్తున్నారని అన్నాడు.

ఐపీఎల్‌లో సగటున 150 కి.మీ/గంట వేగంతో బౌలింగ్ చేస్తూ మయాంక్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడినప్పటికీ స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. గాయం నుంచి ఇటీవల కోలుకున్న అతను బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి టీ20 తుదిజట్టులో చోటు దక్కించుకున్న మయాంక్ అరంగేట్రంలోనే అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మెయిడిన్‌తో అరంగేట్రం చేసిన మూడో భారత బౌలర్‌గా మయాంక్ రికార్డు నెలకొల్పాడు. అజిత్ అగార్కర్, అర్షదీప్ సింగ్ తర్వాత అతను ఈ రికార్డు నమోదు చేశాడు.
''మయాంక్ యాదవ్‌కు ఇది కోరుకునే అరంగేట్రం. మెయిడిన్ ఓవర్‌తో కెరీర్ ఆరంభించాడు. 149.9 కి.మీ/గంట వేగంతో బంతులు వేశాడు. అతను గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చాడు. అందుకే 157-158 కి.మీ/గ వేగంతో బౌలింగ్ చేయలేదనుకుంటా. తొలి టీ20ల్లో హార్దిక్ పాండ్యకు బదులుగా మయాంక్ యాదవ్‌కు కొత్తబంతి ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి''

''అతను ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తున్నాడు. అతని బౌలింగ్‌లో ఫ్రంట్ ఫూట్‌తో బ్యాటర్లు ఆడటానికి ఆలోచిస్తున్నారు. అతను ఫిట్‌గా ఉంటాడని, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తాడని ఆశిస్తున్నా'' అని బసిత్ అలీ పేర్కొన్నాడు. నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో భారత్ అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆడనుంది.