బంగ్లాదేశ్ వరుస సంచలనాలతో హోరెత్తిస్తోంది. న్యూజిలాండ్‌లో ఇటీవల తొలి వన్డే విజయం సాధించిన బంగ్లా జట్టు ఇవాళ తొలి టీ20 గెలుపును రుచి చూసింది. మెక్లిన్ పార్క్ వేదికగా జరిగిన తొలి టీ20లో అయిదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20 సిరీస్‌ను 1-0తో ఘనంగా బోణీ కొట్టింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేసింది. బంగ్లా బౌలర్ల ధాటికి ఒక్క పరుగుకే కివీస్ మూడు వికెట్లు కోల్పోయింది. సీఫెర్ట్ (0), ఫిన్ అలెన్ (1), గ్లెన్ ఫిలిప్స్ (0) వరుసగా పెవిలియన్‌కు చేరారు. కాసేపటికే డారిల్ మిచెల్ (14), చాప్‌మన్ (19) కూడా ఔటవ్వడంతో 50 పరుగులకే కివీస్ సగం వికెట్లు కోల్పోయింది.

అయితే శాంట్నర్ (23), మిల్నే (16) సహాయంతో నీషమ్ (48) స్కోరును ముందుకు నడిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ మూడు వికెట్లు, మహెది హసన్, ముస్తాఫిజుర్ చెరో రెండు వికెట్లు తీశారు. తంజిమ్ హసన్, హొస్సేన్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం బంగ్లాదేశ్ అయిదు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ లిట్టన్ దాస్ (42*) ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లు వరుసగా వికెట్ల సాధిస్తూ ఒత్తిడి తీసుకొచ్చినా లిట్టన్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. బంగ్లా బ్యాటర్లలో సౌమ్య సర్కార్ (22), హ్రిదోయ్ (19), నజ్ముల్ (19), మహేది హసన్ (19*), రోని (10) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సౌథి, మిల్నే, నీషమ్, బెన్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 29న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.