ఢాకా: ప్రపంచ ట్వంటీ 20 కప్ మ్యాచులో భారత్‌తో ఓటమిని తాను మరిచిపోవడం కష్టంగా ఉందని, దానిని మరిచిపోలేకపోతున్నానని బంగ్లాదేశ్ ఆటగాడు మహ్మదుల్లా చెప్పాడు. ఇటీవల జరిగిన ట్వంటీ 20 ప్రపంచ కప్ పోరులో భారత్ చేతిలో ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్ ఓటమి పాలైంది.
ఈ చేదు అనుభవాన్ని బంగ్లా ఆటగాళ్లు మర్చిపోలేకపోతున్నారు. భారత్ తో ఓడిన ఆ రోజు రాత్రి తమ ఆటగాళ్లం భోజనం చేయడం కూడా మానేశామని బంగ్లాదేశ్ కెప్టెన్ మొర్తజా రెండు రోజుల క్రితం చెప్పాడు.

తాజాగా బంగ్లా బ్యాట్సుమెన్ మహ్మదుల్లా తమ జట్టు ఆ రోజు ఓటమి పాలవ్వడం పట్ల నిరాశను మరోసారి వ్యక్తం చేశాడు. ఓడిపోతామని తాము ఊహించలేదని చెప్పాడు. ఆ ఓటమిని మర్చిపోలేమన్నాడు. ఆ రోజు క్రీజులో భారీ షాట్‌కు ప్రయత్నించి తప్పు చేశానని అభిప్రాయపడ్డాడు.
భారీ షాట్ కు ప్రయత్నించకుండా సింగిల్ చేస్తే బాగుండేదన్నాడు. అంతేకాదు, ఆ ఓటమికి బాధ్యత తనదేనని చెప్పాడు. ఈ ఓటమిని తాము ఎలా మర్చిపోగలమన్నాడు. ముష్ఫికర్, నేను క్రీజులో ఉన్నామని, ఓడిపోతామని ఊహించలేదని చెప్పాడు.