బంగ్లాదేశ్ రికార్డు నెలకొల్పింది. సుదీర్ఘ విరామం అనంతరం పాకిస్తాన్ పై టీ20 సిరీస్ ను గెలిచింది. ఇంకో మ్యాచ్ మిగిలివుండగానే.. 2-0 తేడాతో జయకేతనాన్ని ఎగురవేసింది. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. చివరి టీ20 గురువారం సాయంత్రం 5:30 గంటలకు మీర్ పూర్ లో ఆరంభం కానుంది.
ఇక్కడి షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ అధ్వాన్నంగా ఆడింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్.. నిర్ణీత 20 ఓవర్లల్లో 133 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్లు జకెర్ అలీ, మెహదీ హసన్ మాత్రమే భారీ స్కోర్ చేయగలిగారు. జకెర్ అలీ- 55, మెహదీ హసన్- 33 పరుగులతో జట్టు పరువు నిలబెట్టారు.

ఓపెనర్లు మహ్మద్ నయీం- 3, పర్వెజ్ హొస్సైన్ ఎమాన్- 13, కేప్టెన్ లిట్టన్ దాస్- 0, షమీమ్ హొస్సైన్- 1, తంజిమ్ హొస్సైన్ 7, రషీద్ హొస్సైన్- 8, షొరిఫుల్ ఇస్లాం 1 పరుగు చేశారు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ నాటౌట్ గా నిలిచాడు. పాక్ బౌలర్లల్లో సల్మాన్ మీర్జా, అహ్మద్ డేనియల్, అబ్బాస్ అఫ్రిది రెండేసి చొప్పున వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్.. 133 పరుగులను కూడా అందుకోలేకపోయింది. కుప్పకూలింది. 19.2 ఓవర్లల్లో 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. 15 పరుగులకు 5, 88 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఫహీమ్ అష్రాఫ్ ఒంటరిపోరాటం చేశాడు. 32 బంతుల్లో 51 పరుగులు బాదాడు.
అతని ఇన్నింగ్ అంటూ లేకపోయివుంటే పాక్ మరింత భారీ తేడాతో ఓటమి పాలు కావాల్సొచ్చేది. ఫకర్ జమాన్- 8, సయీమ్ అయూబ్- 1, మహ్మద్ హ్యారిస్- 0, సల్మాన్ అఘా- 9, హసన్ నవాజ్- 0, మహ్మద్ నవాజ్- 0, ఖుష్దిల్ షా- 13, అబ్బాస్ అఫ్రిది- 19, అహ్మద్ డేనియల్- 17 పరుగులు చేశారు. పాక్ ఇన్నింగ్ ను కొద్దో గొప్పో ఆదుకున్నది లోయర్ ఆర్డర్ బ్యాటర్లే.
ఈ ఓటమితో ఓ చెత్త రికార్డును నెలకొల్పింది పాకిస్తాన్. ఇప్పటివరకు ఆడిన 31 టీ20 ఇంటర్నేషనల్స్ లో ఆ జట్టు గెలిచింది.. ఎనిమిది మాత్రమే. 23 మ్యాచ్ లల్లో ఘోరంగా ఓటమి చవి చూసింది. ఆ గెలిచిన మ్యాచ్ లు కూడా ఐర్లాండ్, జింబాబ్వే, కెనడా వంటి పసికూనల మీదే. ఐర్లాండ్-2, జింబాబ్వే-2, కెనడాపై ఒక మ్యాచ్ తో పాటు న్యూజిలాండ్ పై ఇంకో గేమ్ లో విజయం సాధించింది.