హైదరాబాద్: బంగ్లాదేశ్ క్రికెటర్ల అత్యుత్సాహం, అనుభవ లేమి మైదానంలో వారి చేష్టలు క్రికెట్ అభిమానులకు నవ్వు తెప్పిస్తున్నాయి. తాజాగా గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సాధారణంగా ఎల్బీలు, క్యాచ్‌లు వంటి అనుమానాస్పద నిర్ణయాల్లో మాత్రమే అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్)ని క్రికెటర్లు కోరుతుంటారు.
కానీ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ సౌమ్య సర్కార్ డీఆర్ఎస్ అడిగిన తీరు క్రికెట్ అభిమానులకు విపరీతమైన నవ్వులు తెప్పించింది. శనివారం చివరి రోజు ఆటలో భాగంగా బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్ నైట్ ఆటగాడు సౌమ్య సర్కార్ గుణరత్నే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దీంతో శ్రీలంక ఆటగాళ్లు సెలబ్రేట్ చేసుకుంటుంటే.. అంపైర్ అవుటైనట్లు వేలు పైకెత్తాడు. ఫీల్డ్ అంపైర్ కాస్త ఆలస్యంగా నిర్ణయం ప్రకటించడంతో అసలు వికెట్ల వద్ద ఏమి జరిగిందో అనే విషయాన్ని అతను పట్టించుకోలేదు. వెనక్కి తిరిగి చూసుకోకుండా తన అవుట్‌పై రివ్యూ కోరాడు. అతను ఇలా చేయడం ఆశ్చర్యం కలిగించింది.
దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ జోకులు వేస్తున్నారు. తొలి టెస్టులో శ్రీలంక 259 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.