సమ్మె విరమించుకున్న బంగ్లా క్రికెటర్లు.. షెడ్యూల్ ప్రకారమే భారత పర్యటన!!

ఢాకా: బంగ్లాదేశ్ ఆటగాళ్లు జీతభత్యాలు, పలు అంశాల విషయంలో బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)పై చేస్తున్న సమ్మెను విరమించుకున్నారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత బీసీబీ పెద్దలతో రెండు గంటల పాటు చేసిన సుదీర్ఘ చర్చలు సఫలం అవ్వడంతో సోమవారం నుండి చేస్తున్న నిరవధిక సమ్మెను బంగ్లా ఆటగాళ్లు విరమించుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. ఇక బంగ్లా ప్రధాని షేక్ హసీనా చేసిన చర్చలు కూడా విజయవంతం అయ్యాయి.

చర్చలు సఫలం:
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలతో చర్చలు సఫలమయ్యాయని బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్, టీ20 కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఓ ప్రకటనలో తెలిపాడు 'బుధవారం బోర్డు అధ్యక్షుడు, డైరెక్టర్లతో సమావేశమయ్యాం. మా డిమాండ్ల గురించి వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మా డిమాండ్లను తీరుస్తామని హామీ ఇచ్చారు. శనివారం నుంచి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్లేయర్లు ఆడుతారు. బంగ్లా జట్టు భారత్ పర్యటనకు వెళ్లనుంది. శుక్రవారం నుండి శిక్షణా శిబిరానికి వెళతాం' అని షకిబ్ తెలిపాడు.

బోర్డు అధికారులతో కీలక ఆటగాళ్ల సమావేశం:
బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన రెండు డిమాండ్లు మినహా మిగిలిన అంశాలను నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లు బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నారు. బోర్డు అధికారులతో మష్రఫె మొర్తజా, షకిబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, మహముదుల్లా, తమీమ్ ఇక్బాల్‌తో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లు హాజరయ్యారు. 11 డిమాండ్లతో సోమవారం బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

ప్రధాని జోక్యం:
బంగ్లా బోర్డు, ఆటగాళ్ల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు బంగ్లా ప్రధాని షేక్ హసీనా కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. వివాదాన్ని పరిష్కరించేందుకు వన్డే కెప్టెన్ మష్రఫె మొర్తజాను మధ్యవర్తిగా పంపారు. సమ్మెను బంగ్లా ఆటగాళ్లు విరమించుకోవడంతో భారత్‌లో వచ్చే నెలలో జరగాల్సిన బంగ్లాదేశ్ పర్యటనపై ఉన్న సందేహాలు పూర్తిగా తొలిగిపోయాయి.

రెండో టెస్టుకు బంగ్లా ప్రధాని:
పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య 3 టీ20 మ్యాచ్‌లు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్‌తో పర్యటన ఆరంభమవుతుంది. ఇక కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బంగ్లా ప్రధాని షేక్ హసీనా ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications