హైదరాబాద్: చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసిన లియాన్, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. తద్వారా ఒక టెస్టు మ్యాచ్‌లో 13 వికెట్లును తన ఖాతాలో వేసుకున్నాడు.
దీంతో ఉపఖండంలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన ఆస్ట్రేలియా బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్ స్టీవ్ ఓకెఫీ రికార్డును లియాన్ అధిగమించాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా పుణె టెస్టులో ఓకెఫీ 12 వికెట్లు తీశాడు.
ఇప్పుడు ఈ రికార్డును లియాన్ అధిగమించాడు. దీంతో పాటుగా కనీసం ఐదు వికెట్లను వరుసగా మూడుసార్లు సాధించిన బౌలర్‌గా లియాన్ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఈ రికార్డుని లియాన్ తన కెరీర్‌లో తొలిసారి సొంతం చేసుకున్నాడు. దీంతో పాటు ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా నిలిచాడు.
ఈ ఏడాది ఇప్పటివరకు 44 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అగ్రస్ధానంలో ఉండగా... ఇప్పుడు ఆ రికార్డుని లియాన్ అధిగమించాడు. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో అశ్విన్, జడేజాలు 44 వికెట్లతో ఇప్పటి వరకు అగ్రస్ధానంలో ఉండగా, దానిని లియాన్ 46 వికెట్లతో అధిగమించాడు.
రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టులో బంగ్లాదేశ్ గెలవగా, రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో సిరిస్‌ను 1-1తో సమం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఒకటి ఓడి ఒకటి గెలిచింది. దీంతో ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఐదో స్థానంలోకి పడిపోయింది.