
కొలంబో: శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలోనూ బంగ్లాదేశ్ ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను లంక 3-0తో కైవసం చేసుకుంది. దీంతో దాదాపు మూడేళ్ల తర్వాత శ్రీలంక వన్డేల్లో క్లీన్‌స్వీప్ సాధించి గత వైభవాన్ని గుర్తు చేసింది. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లాంటి పటిష్ట జట్లపై ప్రతాపం చూపిన బంగ్లాదేశ్ ఇలా మూడు మ్యాచుల్లో ఓడడం విశేషం.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
బుధవారం జరిగిన చివరి వన్డేలో లంక 122 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 294 పరుగులు చేసింది. సీనియర్ బ్యాట్స్‌మన్ ఎంజెలో మాథ్యూస్ (90 బంతుల్లో 87; 8 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. కెప్టెన్ కరుణరత్నే (46), కుశాల్ పెరీరా (42) రాణించారు. బంగ్లా బౌలర్లలో షఫీయుల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్ చెరో 3 వికెట్లు తీశారు.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. సౌమ్య సర్కార్ (86 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే ఒంటరి పోరాటం చేసాడు. టెయిలెండర్ తైజుల్ ఇస్లామ్ (39 నాటౌట్) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో దసున్ శనక 3 వికెట్లు పడగొట్టగా, కసున్ రజిత రెండు వికెట్లు తీసి లంక గెలుపులో కీలక భూమిక పోషించారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న లంకేయులు నామమాత్రమైన మూడో వన్డేలో సత్తా చాటారు. మాథ్యూస్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి.