సొంతగడ్డపై బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ ఓటమి ఇంగ్లండ్ కొంపముంచింది. వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ టేబుల్‌లో క్రమంగా తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటూ ఫైనల్ బెర్తుపై కన్నేసిన ఇంగ్లండ్‌కు.. పాక్ ఘోర ఓటమి తీవ్ర ప్రభావం చూపించింది. గత వారంలో టాప్-4కు దూసుకొచ్చిన ఇంగ్లిష్ జట్టు పాయింట్ల పట్టికలో అయిదో స్థానానికి పడిపోయింది.
నెల రోజుల క్రితం ఏడో స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ వరుస విజయాలతో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. స్వదేశంలో వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంక సిరీస్‌ను 3-0తో సాధించేలా కనిపిస్తోంది. ఇప్పటికే లంకపై రెండు టెస్టులు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయాలతో ఇంగ్లండ్ ఫైనల్ రేసులోకి తిరిగొచ్చింది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా (62.50%), న్యూజిలాండ్ (50 %)కు చేరువగా ఇంగ్లండ్ (45 %) చేరింది.

అయితే ఈ సమయంలో పాకిస్థాన్ ఘోర పరాజయం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికపై ప్రభావం చూపించింది. పాక్‌ను 2-0తో ఓడించిన బంగ్లాదేశ్ 45.83 శాతంతో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. దీంతో బంగ్లా అనూహ్యంగా రేసులోకి వచ్చింది. ఈ నెలలో భారత్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ను కూడా గెలిస్తే బంగ్లా తన టేబుల్‌లో తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకుంది. ఇక పాకిస్థాన్ 19.05 శాతంతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
2023 నుంచి 2025 వరకు జరుగనున్న టెస్టు మ్యాచ్‌ల విజయాల శాతం ప్రకారం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండు జట్లు అర్హత సాధిస్తాయి అనే విషయం తెలిసిందే. పట్టికలో అంతిమంగా టాప్-2లో నిలిచిన జట్లు జూన్‌లో జరగనున్న ఫైనల్‌లో తలపడతాయి. భారత్ 68.52 శాతంతో అగ్రస్థానంలో ఉంది. టీమిండియా తుది పోరుకు అర్హత సాధించడం దాదాపు ఖాయమే.
ఇక పోటీ అంతా రెండో స్థానం గురించే. న్యూజిలాండ్.. భారత్‌తో మూడు, శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుని, టీమిండియాను ప్రతిఘటిస్తే కివీస్ తన పర్సంటేజ్‌ను మెరుగుపర్చుకుంది. ఇక ఆస్ట్రేలియా.. భారత్‌తో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ చిత్తుగా ఓడితే రెండో స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మరోవైపు ఇంగ్లండ్.. శ్రీలంకతో సిరీస్ ముగిసిన అనంతరం పాకిస్థాన్‌తో మూడు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇంగ్లండ్ సత్తాచాటితే రెండో స్థానానికి చేరే అవకాశం కూడా ఉంది.