Nasir Hossain: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ నాసిర్ హుస్సేన్ రెండేళ్ల నిషేధం తర్వాత క్రికెట్ మైదానంలోకి వచ్చాడు. నాసిర్ హుస్సేన్ 2020-21 అబుదాబి టీ20 లీగ్ సందర్భంగా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రాగా.. దీనిపై విచారణ చేపట్టిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నాసిర్ హుస్సేన్ ను దోషిగా తేల్చింది. అబుదాటి టీ20 లీగ్ సందర్భంగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినట్లు నాసిర్ హుస్సేన్ మూడు ఆరోపణలను అంగీకరించాడు. దీంతో హుస్సేన్ ను రెండేళ్లపాటు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి నిషేధించారు. అందులో ఆరు నెలలు సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాసిర్ హుస్సేన్ నిషేధానికి సంబంధించిన అన్ని ప్రమాణాలను పూర్తి చేసుకుని కెరీర్ ను తిరిగి ప్రారంభించేందుకు అర్హత సాధించాడు.
నాసిర్ హుస్సేన్ పై నిషేధం ఎత్తివేయడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. నాసిర్ హుస్సేన్ అధికారిక క్రికెట్ ఆడటానికి ఏప్రిల్ 7,2025 నుంచి మార్గం తెరిచి ఉందని తెలిపింది. నిషేధ నిబంధనల ప్రకారం నాసిర్ హుస్సేన్ అవినీతి నిరోధక విద్యా సెషన్ పూర్తి చేయడంతో పాటు అన్ని అవసరాలను తీర్చాడని పేర్కొంది. నాసిర్ హుస్సేన్ తనపై సస్పెన్షన్ ఎత్తివేసిన రోజునే ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్ మ్యాచ్ లో రూప్‌గంజ్ టైగర్స్ క్రికెట్ క్లబ్ తరపున ఆడుతున్నాడు. నాసిర్ హుస్సేన్ రూప్ గంజ్ టైగర్స్ తరపున ఘాజీ గ్రూప్ జట్టుతో తలపడ్డాడు.

మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన నాసిర్ హుస్సేన్
నాసిర్ హుస్సేన్ 2011లో బంగ్లాదేశ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. 2011 నుంచి 2018 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో బంగ్లాదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో ఈ స్టార్ ఆల్‌రౌండర్ 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. నాసిర్ హుస్సేనే ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్ రెండింటిలోనూ 6,000 పరుగులు సాధించాడు. రెండు ఫార్మాట్లలో హుస్సేన్ 17 సెంచరీలు సాధించాడు. నాసిర్ హుస్సేన్ బంగ్లాదేశ్ తరఫున 2018లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి నాసిర్ హుస్సేన్ ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ లీగ్ మ్యాచ్‌ల్లో పాల్గొంటూ వస్తున్నాడు.