టెస్టు క్రికెట్‌లో సంచలనం. పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ చారిత్రక విజయాన్ని సాధించింది. పాక్‌పై తొలిసారి గెలుపు రుచి చూసింది. రావల్పండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌ను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మొత్తంగా మూడు టెస్టుల సిరీస్‌లో బంగ్లా ఘనంగా బోణీ కొట్టింది. మరోవైపు సొంతగడ్డపై పాకిస్థాన్ వరుసగా తొమ్మిదో టెస్టును విజయం సాధించలేకపోయింది.
ఓవర్‌నైట్ స్కోరు 23/1తో అయిదో రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్ 146 పరుగులకే ఆలౌటైంది. మహ్మద్ రిజ్వాన్ (51; 80 బంతుల్లో, 6 ఫోర్లు) టాప్ స్కోరర్. ఓపెనర్ షపికీ (37), బాబర్ అజామ్ (22) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మెహదీ హసన్ నాలుగు, షకిబ్ అల్ హసన్ మూడు వికెట్లతో చెలరేగారు.

అనంతరం 30 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు జకీర్ హసన్ (15 నాటౌట్; 26 బంతుల్లో, 3 ఫోర్లు), షద్మాన్ (9 నాటౌట్; 13 బంతుల్లో, 1 ఫోర్) జట్టును విజయతీరాలకు చేర్చారు. కాగా, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) రాణించారు. నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, షాజాద్, మహ్మద్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, 117 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది.