INDvsBAN: అతను ఉండుంటే భారత్‌ను కట్టడి చేసేవాళ్లం.. బంగ్లా స్పిన్నర్ కామెంట్స్

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లా బౌలర్లు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. తొలి ఇన్నింగ్స్‌లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో భారత జట్టు 404 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు రాణించడంతో బంగ్లాను కేవలం 150 పరుగులకే ఆలౌట్ చేసింది. మళ్లీ రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్, వెటరన్ ఛటేశ్వర్ పుజారా ఇద్దరూ సెంచరీలు చేయడంతో బంగ్లా ముందు 513 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.

అతను బౌలింగ్ చేసుంటే..
ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బంగ్లా ఆల్‌రౌండర్ మెహదీ హసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టులో కెప్టెన్ షకీబల్ హసన్ బౌలింగ్ చేయలేకపోయాడని, బౌలింగ్ ఎటాక్‌లో అతని సేవలు మిస్ అవడం జట్టును గట్టిగా దెబ్బతీసిందని అన్నాడు. షకీబల్ బౌలింగ్ చేసి ఉంటే భారత్‌ను కట్టడి చేసి ఉండేవాళ్లమని అభిప్రాయపడ్డాడు.
బౌలింగ్ చేసే సమయంలో షకీబ్.. బాగా నొప్పితో బాధ పడ్డాడని, అందుకే ఆ తర్వాత బౌలింగ్ చేయలేదని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసేందుకు ప్రయత్నించినా దాన్ని కొనసాగించలేకపోయాడని వివరించాడు. అదే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో యువ పేసర్ ఎబాదత్ హొస్సేన్ కూడా గాయపడడంతో అతను కూడా బౌలింగ్ చేయలేదు. ఈ అవకాశాలను టీమిండియా బ్యాటర్లు చక్కగా ఉపయోగించుకున్నారు.

గాయాలతోనే బరిలోకి..
ఈ టెస్టు సిరీస్‌కు ముందు జరిగిన వన్డే సిరీస్‌లో షకీబల్ హసన్ గాయపడ్డాడు. అతని పక్కటెముకలు, భుజానికి గాయాలయ్యాయి. దీంతో తొలి టెస్టులో అతను ఆడటం అనుమానంగా మారింది. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పట్టుబట్టడంతో షకీబల్ హసన్ ఈ మ్యాచ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 12 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయనేలేదు. అలాగే రెండో ఇన్నింగ్స్ సమయానికి యువ పేసర్ ఎబాదత్ కూడా గాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్‌ను అవుట్ చేసిన ఎబాదత్.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. అయితే అతనికి తగిలిన గాయం అంత పెద్దది కాదని మెహదీ హసన్ చెప్పాడు.

బంగ్లా ముందు భారీ టార్గెట్..
ఇలా ఇద్దరు కీలక బౌలర్ల సేవలు మిస్ చేసుకున్న బంగ్లాదేశ్ బౌలింగ్ దళం.. భారత బ్యాటర్ల ముందు తేలిపోయింది. శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా ఇద్దరూ శతకాలతో రాణించారు. ఆ తర్వాత టీమిండియా 258/2 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లా ముందు 513 పరుగుల లక్ష్యం నిలిచింది. అయితే ఆట ఇంకో రెండ్రోజులు మిగిలి ఉండటంతో ఎలాగైనా పోరాడాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 12 ఓవర్లకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 42 పరుగులు చేసింది. విజయం కోసం బంగ్లా ఇంకా 471 పరుగులు చేయాల్సి ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications