హైదరాబాద్: రెండేళ్ల క్రితం భారత క్రికెటర్లకు తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన బంగ్లా సంచలన పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ భారత పర్యటనకు దూరమయ్యాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లపై అద్భుత ప్రదర్శన చేసిన ముస్తాఫిజుర్ అనతికాలంలో మంచి బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న ముస్తాఫిజుర్ కోలుకున్నప్పటికీ సరైన ప్రాక్టీస్ లేకపోవడంతో అతడిని ఈ ఏకైక టెస్టుకి ఎంపిక చేయలేదని బంగ్లా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ మిన్హజుల్ అబ్దిన్ తెలిపాడు. ముస్తాఫిజుర్ స్థానంలో మరో పేసర్ షఫియుల్ ఇస్లాంను తీసుకున్నారు.
ఈ మేరకు ముష్ఫికర్ రహీం సారథ్యంలోని 15 మంది సభ్యలు జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన ముస్తాఫిజుర్ ఈ టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ అభిమానులు నిరాశ చెందారు.

మరోవైపు భారత్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్, శ్రీలంకతో టెస్టు సిరిస్ ఆడనుంది. దీంతో ముస్తాఫిజుర్‌ను లంకతో జరిగే సిరిస్‌లో ఆడించాలనే యోచనలో సెలక్టర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగనున్న ఈ ఏకైక టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
భారత్‌తో ఏకైక టెస్టుకు బంగ్లాదేశ్ జట్టు:
ముష్ఫికర్ రహీమ్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, మహ్మదుల్లా రియాద్, ఇమ్రుల్ కయీస్, షకీబ్ అల్‌హసన్, మెహదీ హసన్ మిరాజ్, మొమినుల్ హక్, షబ్బీర్ రెహ్మాన్, లిటన్ దాస్, తస్కిన్ అహ్మద్, సుబాశిష్ రాయ్, తైజుల్ ఇస్లాం, కమ్రుల్ ఇస్లాం రబ్బి, షఫియుల్ ఇస్లాం