భారత్‌తో మ్యాచ్‌కు బ్లాక్ బ్యాడ్జీలతో బంగ్లా క్రికెటర్లు

Posted By:
Bangladesh players to wear black armbands in the game against India today

హైదరాబాద్: ముక్కోణపు టోర్నీలో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఈ రోజు మ్యాచ్‌ జరగనుంది. కొలంబో వేదికగా జరగనున్న ఈ టోర్నీకి బంగ్లా ఆటగాళ్లు నల్ల బ్యాడ్జిలు ధరించి ఆడనున్నారు. ఈ విషయాన్ని బంగ్లా జట్టు కెప్టెన్ మీడియాకు వెల్లడించారు. సోమవారం నేపాల్‌లో ఘోర విమాన ప్రమదం చోటు చేసుకున్న కారణంగా వారు ఇలా చేయనున్నారట.

నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌లో యూఎస్-బంగ్లా విమానం బీఎస్211 అదుపుతప్పి నేలను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికీ బంగ్లా క్రికెటర్లు నల్ల బ్యాడ్జిలు ధరించి నివాళులర్పించనున్నారు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్, బంగ్లాదేశ్ జట్లు రెండోసారి తలపడనున్నాయి.

మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ జట్టు కెప్టెన్ మహ్మదుల్లా రియాద్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఈ విచారకర ఘటన మా అందరినీ కలచివేసింది. మృతిచెందిన వారిలో దాదాపు 30-40మంది బంగ్లాదేశీయులు ఉన్నారు. మేమంతా చనిపోయిన వారి కుటుంబాలకు మద్దతుగా ఉంటాం. బాధిత కుటుంబాలు ఈ విషాద ఘటన నుంచి తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం' అని రియాద్ పేర్కొన్నాడు.

ఇప్పటికే రియాద్‌తో పాటు బ్యాట్స్‌మెన్లు ముస్తాఫిజుర్ రెహమాన్, తమీమ్ ఇక్బాల్ ట్విటర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

సిరీస్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బంగ్లా టైగర్స్ భావిస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఆశిస్తోంది. ముక్కోణపు టోర్నీలో భారత్‌ ఈ రోజు తన చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతోంది. బుధవారం రాత్రి జరగనున్న ఇరుజట్ల పోరుకు ప్రేమదాస స్టేడియం సిద్ధం కానుంది.

Story first published: Wednesday, March 14, 2018, 17:37 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి