ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షహదత్ హుస్సేన్ సోమవారం నాడు న్యాయస్థానం ఎదుట లొంగిపోయాడు. ఇంట్లో పని చేసే పదకొండేళ్ల బాలికను హింసించినట్లు షాహదత్ దంపతుల పైన గత నెలలో ఆరోపణలు వచ్చాయి.
అప్పటి నుంచి వీరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. షహదత్ భార్యను పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు. సోమవారం క్రికెటర్ కూడా కోర్టు ఎదుట లొంగిపోయాడు. బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. సోమవారం సాయంత్రం ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశముంది.
ఈ కేసు నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షాహదత్‌ను అన్ని రకాల క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. ఆరోపణలపై నిజానిజాలు తేలే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పింది.
ఇంట్లో పని చేసిన బాలికను వేధింపులకు గురి చేయడమే కాకుండా, తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలతో బంగ్లాదేశ్ షహాదత్ హుస్సేన్ సతీమణి న్రిట్టో హుస్సేన్‌ను పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు.

బాలిక పైన వేధింపులు, దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ షహదత్, ఆయన భార్య పైన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆమెను ఆదివారం అరెస్టు చేశారు. సోమవారం క్రికెటర్ లొంగిపోయాడు. ఆదివారం న్రిట్టో హుస్సేన్ ఇంట్లో సోదాలు నిర్వహించి ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హుస్సేన్ తన భార్యతో కలిసి అత్తగారింట్లో తలదాచుకున్నట్లు సమాచారం తమకు అందడంతో రంగంలోకి దిగామని పోలీసులు చెప్పారు. అయితే, ఆ ఇంట్లో షహదాత్ లేకపోవడంతో అతని భార్యను అరెస్టు చేశామన్నారు. కాగా, షహదత్ బంగ్లాదేశ్ తరఫున 38 టెస్డటులు, 51 వన్డేలు ఆడాడు. షహదత్ పైన కేసు నమోదు కావడంతో బంగ్లా జట్టు నుంచి సస్పెండ్ అయ్యాడు.