వంగి వంగి దండాలు: దెబ్బకు దారికొచ్చిన బంగ్లాదేశ్!
బీసీసీఐతో నెలకొన్న విభేధాలను తొలగించుకుని తిరిగి సత్సంబంధాలను నెలకొల్పుకోవడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌లో పర్యటించేందుకు గతంలో నిరాకరించిన బంగ్లాదేశ్.. ఇప్పుడు తన తప్పును తెలుసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కోరుతూ బీసీసీఐకి అధికారికంగా లేఖ రాసింది.
వివాదానికి నేపథ్యం
ఐపీఎల్ 2026 సీజన్‌లో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఆడేందుకు బీసీసీఐ అనుమతి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. దీనికి ప్రతిచర్యగా భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ తమ జట్టును భారత్‌కు పంపేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. అంతేకాకుండా తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. అయితే భారత్‌లో భద్రతా లోపాలు లేవని స్పష్టం చేస్తూ ఐసీసీ ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.

ఆర్థిక, రాజకీయ ఒత్తిడి
ప్రస్తుత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ తీరుపై అక్కడి క్రికెట్ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.భారత్‌తో సత్సంబంధాలు దెబ్బతినడం వల్ల వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరగనున్న 50 ఓవర్ల ఆసియా కప్, అలాగే సెప్టెంబర్‌లో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై నీలినీడలు అలుముకున్నాయి. భారత జట్టుతో మ్యాచ్‌లు జరిగితేనే బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల ద్వారా భారీ ఆదాయం లభిస్తుంది. ఈ ఆర్థిక అవసరాల దృష్ట్యా అమీనుల్ ఇస్లాం పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని, తాత్కాలిక బోర్డు ఏర్పాటు కానుందని సమాచారం.
కొత్త సారథ్యంలో మార్పులు?
ఈ సంక్షోభ సమయంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో గొడవ పడటం కంటే స్నేహపూర్వకంగా ఉండటమే శ్రేయస్కరమని తమీమ్ ఇక్బాల్ మొదటి నుంచీ చెబుతున్నారు. తమీమ్ ఇక్బాల్ నియామకం జరిగితే రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మళ్లీ పూర్వస్థితికి వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఏప్రిల్ 9న వెలువడనుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ క్రికెట్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications