దుబాయ్ వేదికగా జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ తమ టైటిల్‌ను నిలబెట్టుకుంది. మరోవైపు యూత్ క్రికెట్ ఆసియా మెగాటోర్నీ ఫైనల్‌లో ప్రత్యర్థి చేతిలో భారత్ ఓటమిపాలవ్వడం ఇదే తొలిసారి. బ్యాటర్ల వైఫ్యలంలో 59 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. రిజాన్ హొస్సేన్ (47; 65 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. మహ్మద్ షిహాబ్ జేమ్స్ (40; 67 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), ఫరీద్ హసన్ ఫైసల్ (39; 49 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేశారు. యుధజిత్ గుహా (2/29), చేతన్ శర్మ (2/42), హార్దిక్ రాజ్ (2/41) తలో మూడు వికెట్లు తీశారు. కిరణ్ (1/19), కార్తికేయ (1/37), ఆయుష్ (1/9) తతో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన యువ భారత్ 35.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మహ్మద్ అమాన్ (26; 65 బంతుల్లో, 1 ఫోర్) టాప్ స్కోరర్. అజిజుల్ హకీమ్ (3/8), ఇక్బాల్ హొస్సేన్ (3/24) చెరో మూడు వికెట్లు, ఫహద్ (2/34) రెండు వికెట్లు పడగొట్టారు. రిజాన్ హొస్సేన్ (1/14), మారుఫ్ మ్రిధా (1/36) తలో వికెట్ తీశారు. ఛేదన ఆది నుంచే భారత్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఆయుష్ (1; 8 బంతుల్లో) ఒక్క పరుగుకే వెనుదిరిగాడు.
మరో ఓపెనర్, సంచలన కుర్రాడు వైభవ్ సూర్యవంశీ (9; 7 బంతుల్లో, 2 ఫోర్లు) నిరాశపరిచాడు. అయితే సిద్ధార్థ్ (20; 35 బంతుల్లో, 3 ఫోర్లు), కార్తికేయ (21; 43 బంతుల్లో, 2 ఫోర్లు), అమాన్ కాసేపు నిలకడగా ఆడటంతో 73/3తో భారత్ తిరిగి పోటీలోకి వచ్చింది. కానీ బంగ్లా బౌలర్లు తిరిగి పుంజుకోవడంతో 73 స్కోరుకే సగం వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో హార్దిక్ రాజ్ (24; 21 బంతుల్లో, 3 ఫోర్లు), చేతన్ శర్మ (10; 12 బంతుల్లో, 1 ఫోర్) స్వల్ప పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించింది.
1989 నుంచి జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ ఎనిమది సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 1989, 2003, 2012, 2013/14, 2016, 2018, 2019, 2021లో టైటిల్ నెగ్గింది. మూడు సార్లు ఫైనల్‌కు వెళ్లిన బంగ్లాదేశ్ రెండు సార్లు విజేతగా నిలిచింది. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఒక్కోసారి ఆసియా కప్‌ను అందుకుంది.