హైదరాబాద్: వన్డే క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ అతిపెద్ద విజయం (పరుగుల పరంగా) నమోదు చేసింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై 163 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది.
దీంతో 2012లో వెస్టిండిస్‌పై 160 పరుగుల తేడాతో నెగ్గిన రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. బంగ్లా బ్యాట్స్‌మెన్ తమీమ్ ఇక్బాల్ (84), షకీబ్ ఉల్ హసన్ (67), ముఫ్ఫికర్ రహీమ్ (62) హాఫ్ సెంచరీలతో రాణించారు.
శ్రీలంక బౌలర్లలో తిసార పెరీరాకు 3 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక బంగ్లా బౌలర్ల ధాటికి లంక 32.2 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. తిసారా పెరీరా (29) టాప్ స్కోరర్‌గా నిలవగా, దినేశ్ చండీమాల్ (28) పరుగులతో ఫరవాలేదనిపించాడు.
బ్యాటింగ్‌లో రాణించిన షకీబ్ ఉల్ హాసన్ బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీశాడు. మరోవైపు మోర్తజా, రూబెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన షకీబ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ టోర్నీలో శ్రీలంకకు ఇది వరుసగా రెండో పరాజయం.