హైదరాబాద్: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో అపశృతి చోటుచేసుకుంది. తొలి టెస్టు చివరి రోజైన సోమవారం న్యూజిలాండ్ బౌలర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో బంగ్లా కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ గాయపడ్డాడు.
వెల్లింగ్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టిమ్ సౌథీ వేసిన బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో రహీమ్ తల వెనుక భాగంలో హెల్మెట్‌కు బంతి బలంగా తగలడంతో పిచ్‌పై కుప్పకూలిపోయాడు. దీంతో వైద్య సిబ్బంది హూటాహుటిన మైదానంలోకి పరుగులు పెట్టి రహీమ్‌కు ప్రథమ చికిత్స చేశారు.

ఆ తర్వాత రహీమ్‌ను వెంటనే అంబులెన్స్‌లో వెల్లింగ్టన్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతడికి ఎక్స్ రే, ఇతర వైద్య పరీక్షలు చేశారు. రహీమ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, క్షేమంగా ఉన్నారని జట్టు మేనేజ్‌మెంట్ వెల్లడించింది.
దీంతో మ్యాచ్‌ని 20 నిమిషాల పాటు నిలిపివేశారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్‌లోని రహీమ్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా ఈ విషయం వారికి చెప్పినట్టు జట్టు మేనేజ్‌మెంట్ తెలిపారు. రహీమ్‌కు ఎక్స్ రే, ఇతర వైద్య పరీక్షలు చేశారని వారికి తెలియజేశారు.
రహీమ్ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెప్పినట్టు వెల్లడించారు. ముష్ఫికర్ రహీమ్ 13 పరుగుల వద్ద క్రీజులో ఉన్నప్పుడు ఆటలో ఈ అపశృతి చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే ఇదే మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్ ఇమ్రుల్ కేస్ కాలికి గాయం కావడంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.