
హైదరాబాద్: చిట్టగాంగ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అరుదైన రికార్డు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 513 పరుగులు చేసింది. అయితే ఈ పరుగుల్లో ఒక్కటంటే ఒక్క బై కానీ, లెగ్ బై నుంచి వచ్చిన పరుగులు లేకపోవడం విశేషం.
గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌కు ఇది ఐదో అత్యధిక స్కోరు కాగా, 2014లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 494 పరుగులు చేసింది. ఈ స్కోరులో కూడా బై, లెగ్‌బై నుంచి ఒక్క పరుగు రాలేదు. ఇప్పుడు ఈ రికార్డుని బంగ్లాదేశ్ అధిగమించింది.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారీ స్కోర్లు నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 513 పరుగులు చేయగా.. మూడో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 504/3తో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో రోషన్ డిసిల్వా (87), దినేశ్ చండిమాల్ (37) పరుగులతో ఉన్నారు.
ఆటలో భాగంగా మరో రెండు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశముంది. ఓవర్‌నైట్ స్కోరు 189/1తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్(196; 327 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్సర్లు) డబుల్ సెంచరీని తృటిలో మిస్సయ్యాడు.
83 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ చేపట్టిన మెండిస్ నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీ దిశగా సాగాడు. అయితే డబుల్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఔటయ్యాడు. మరో ఓవర్ నైట్ ఆటగాడు ధనంజయ డిసిల్లా 173 పరుగులు నమోదు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 308 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
పిచ్ బౌలర్లకి ఏంత మాత్రం సహకరంచడం లేదు. అయినప్పటికీ, జట్టు స్కోరు 308 వద్ద ధనంజయ, 415 వద్ద కుశాల్ ఔటైనా.. తర్వాత మరో వికెట్ పడకుండా రోషన్, దినేశ్‌లు మూడో ఆటని ముగించారు.