
దుబాయ్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు కోవిడ్-19 యోధులకు నివాళి అర్పించింది. కరోనా పోరాటంలో భాగమైన వైద్య, రక్షణ శాఖకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. కోవిడ్-19 యోధుల సేవలకు గుర్తుగా ఇండియన్ ప్రీమియర్ (ఐపీఎల్) 2020లో ఆర్‌సీబీ ఆటగాళ్లు 'మై కోవిడ్ హీరోస్' జెర్సీలతో బరిలోకి దిగనున్నారు. టోర్నీ ఆసాంతం ఈ జెర్సీలతోనే బెంగళూరు ఆటగాళ్లు ఆడనున్నారు. ప్రాక్టీస్ కూడా ఇదే జెర్సీలతో చేయనున్నారు.
ఐపీఎల్ 13వ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. 'మై కొవిడ్ హీరోస్' కార్యక్రమం ద్వారా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న యోధులకు సంఘీభావం ప్రకటించింది. 'మై కోవిడ్ హీరోస్' జెర్సీల లోగోను ఆర్‌సీబీ జట్టు యాజమాన్యం తాజాగా విడుదల చేసింది. విరాట్ కోహ్లీ, పార్థివ్ పటేల్, దేవ్‌దత్ పడిక్కల్‌లు జెర్సీల లోగోను విడుదల చేశారు. ఇందులో ప్రాక్టీస్, మ్యాచ్‌లలో ధరించే జెర్సీలు ఉన్నాయి. ఆటగాళ్ల జెర్సీ వెనకబాగంలో 'మై కోవిడ్ హీరోస్' అని రాసి ఉంది. ఇక లీగ్ తొలి మ్యాచ్‌లో ఆటగాళ్లు ధరించే జెర్సీలను వేలం వేసి.. వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని 'గివ్ ఇండియా ఫౌండేషన్'కు విరాళంగా కూడా ఇవ్వనున్నారు.
వర్చువల్ మీడియా సమావేశంలో కోహ్లీ, పార్థివ్, పడిక్కల్‌లు కొవిడ్ హీరోలకు నివాళులర్పించినట్టు ఆర్‌సీబీ చైర్మన్ సంజీవ్ చురివాలా తెలిపారు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... ' ఈ ప్రచారంలో పాల్గొనడం గర్వంగా ఉంది. ప్రజలు తమ సొంత పరిస్థితి గురించి ఏమాత్రం ఆలోచించకుండా నిస్వార్థంగా ప్రజలకు సహాయం చేయడానికి ముందుకువస్తున్నారు. మ్యాచ్‌ల సమయంలో జర్సీ ధరించే ఈ ప్రచారంలో భాగం కావడం మాకు సంతోషంగా ఉంది. అహర్నిశలు శ్రమిస్తున్న కొవిడ్ యోధుల త్యాగాలు, వారి సేవలను గుర్తించి గౌరవించడం బాధ్యత. లాక్డౌన్ సమయంలో ఇతరులకు సహాయం చేయడానికి అవిశ్రాంతంగా పనిచేసిన రియల్ ఛాలెంజర్స్ కు నా వందనాలు' అని అన్నాడు.
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా.. ఆ జట్టు ఛాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు (2009, 2011, 2016) ఫైనల్‌కు చేరినా కప్పు సాధించలేకపోయింది. గత మూడు సీజన్లలో ప్రదర్శన ఏమాత్రం బాలేదు. 2019లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మరి ఈసారి సీజన్‌ను ఎలా ముగిస్తుందో చూడాలి. ఈ నెల 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోహ్లీ సేన తలపడనుంది.
ఆర్‌సీబీ జట్టు:
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, దేవ్‌దత్ పడిక్కల్, గురుకీరత్ మన్ సింగ్, మొయీన్ అలీ, మొహమ్మద్ సిరాజ్, నవద్‌ప్ సైనీ, పార్థివ్ పటేల్, పవన్ నేగి, శివం దూబే, ఉమేశ్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, జోష్ ఫిలిప్, పవన్ దేశ్‌పాండే, డేల్ స్టెయిన్, షాబాద్ అహ్మద్, ఇసురు ఉడానా, ఆడం జంపా.