

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు మరో తెలుగు కుర్రాడు ఎంపికయ్యాడు. మంగళవారం జైపూర్ వేదికగా ఐపీఎల్ 2019 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ కాపిటల్స్ జట్టు మరోమారు ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది.
కనీసధర రూ. 20 లక్షలకో వేలంలోకి వచ్చిన బండారు అయ్యప్పను అంతే ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. మీడియం పేసర్ అయిన బండారు అయ్యప్ప 2018-19 దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. కుడి చేతివాటం బ్యాట్స్‌మన్ అయిన అయ్యప్ప ఆంధ్ర తరుపున అండర్-16, అండర్-19 జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
కాగా, మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ప్రాంఛైజీల సూచన మేరకు 351 మంది తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు.
70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీపడగా 60 మందిని కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 విదేశీ ఆటగాళ్లున్నారు. వీళ్ల కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి రూ. 106.8 కోట్లు ఖర్చు చేశాయి. ఈసారి వేలంలో యువీ లాంటి ఆటగాడు అతి కష్టం మీద అమ్ముడుపోగా.. వరుణ్ చక్రవర్తి అనే తమిళనాడు స్పిన్నర్‌ను పంజాబ్ రూ.8.4 కోట్లకు కొనుగోలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
గత సీజన్లో జయదేవ్ ఉనద్కత్‌ను రూ.11.50 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ ఈసారి కూడా అతడిని రూ.8.40 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక, పేసర్ మోహిత్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ రూ.5 కోట్లకు దక్కించుకుంది. ఈ వేలంలో చెన్నై ఇద్దరిని, హైదరాబాద్ ముగ్గుర్ని మాత్రమే కొనుగోలు చేశాయి.
ఐపీఎల్ 2019 సీజన్‌కు ఢిల్లీ జట్టు:
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, రాహుల్ తెవాటియా, జయంత్ యాదవ్, మనోజ్ కార్లా, కొలిన్ మున్రో, క్రిస్ మోర్రిస్, కగిసో రబాడ, సందీప్ లమిచానే, ట్రెంట్ బౌల్ట్
ట్రేడింగ్ ద్వారా జట్టులోకి: శిఖర్ ధావన్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:
హనుమ విహారి - Rs 2 crore
అక్షర పటేల్ - Rs 5 crore
ఇషాంత్ శర్మ - Rs 1.10 crore
అంకుష్ బెయాన్స్ - Rs 20 lakh
నాథు సింగ్ - Rs 20 lakh
కొలిన్ ఇంగ్రామ్ - Rs 6.40 crore
రూథర్‌ఫర్డ్ - Rs 2 crore
కీమో పాల్ - Rs 50 lakh
జలజ్ సక్సేనా - Rs 20 lakh
బండారు అయ్యప్ప - Rs 20 lakh