
ఢాకా: ఆస్ట్రేలియా జట్టుకు ఆతిధ్య బంగ్లాదేశ్ మరోసారి భారీ షాక్ ఇచ్చింది. తొలి టీ20 ఓటమి నుంచి తేరుకోకుండానే.. ఆసీస్‌ను రెండో టీ20లో ఓడించి బంగ్లా సంచలనం సృష్టించింది. బుధవారం ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన బంగ్లా.. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కీలక సమయంలో బ్యాట్ జులిపించిన అఫిఫ్ హుస్సేన్ (37, 31 బంతుల్లో 5x4, 1x 6)కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ కూడా గెలిస్తే.. బంగ్లా ఖాతాలో సిరీస్ చేరనుంది.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసింది. ఆసీస్ ఓపెనర్లు జోష్ ఫిలిప్ (10), అలెక్స్ క్యారీ (11) విఫలమయ్యారు. ఈ సమయంలో మిచెల్ మార్ష్ (45), మొయిసెస్ హెన్రిక్స్ (30) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ పెవిలియన్ చేరిన అనంతరం మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఇన్నింగ్స్ చివరలో స్టార్క్ చేసిన 13 పరుగులే అత్యధికం. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ 3 వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ 2, షకీబ్ ఉల్ హాసన్, మెహదీ హసన్ చెరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్ (9), సౌమ్యా సర్కార్‌లు (0)లు తొందరగా ఔటైనా.. షకీబ్ ఉల్ హాసన్ 26, మెహదీ హసన్ 23 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరి అనంతరం బంగ్లా తడబడింది. మహ్మదుల్లా డకౌట్ అయ్యాడు. దీంతో ఆసీస్ రేసులోకి వచ్చింది. అయితే చివర్లో అఫిఫ్ హొస్సేన్ (37 నాటౌట్), వికెట్ కీపర్ నూరుల్ హసన్ (22 నాటౌట్) ఆస్ట్రేలియాకు మరో అవకాశం ఇవ్వలేదు. ఈ ఇద్దరు చివరి వరకు నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు.