స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పూనియాపై మరోసారి సస్పెన్షన్ వేటు పడింది. డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఒలింపిక్స్ పతక విజేత బజ్‌రంగ్ పూనియాపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిషేధాన్ని విధిస్తూ ఛార్జ్ నోటీసులు జారీచేసింది. గత నెలలోనే బజ్‌రంగ్‌ను నాడా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే కొన్ని రోజుల క్రితం 'నాడా క్రమశిక్షణ సంఘం' (ఏడీడీపీ) బజ్‌రంగ్‌పై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. నాడా తదుపరి నోటీసులు ఇచ్చేదాకా బజ్‌రంగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు ఏడీడీపీ తెలిపింది. ఎక్స్‌పైరీ అయిన కిట్‌లు వాడటంపై తాను అడిగిన ప్రశ్నలకు నాడా బదులివ్వలేదని బజర్ంగ్ పునియా వివరణ ఇవ్వడంతో.. ఏడీడీపీ తాత్కాలింకగా సస్పెన్షన్‌ను రద్దు చేసింది. కానీ నాడా ఛార్జ్ నోటీసులతో మరోసారి కొరడా ఝుళిపించింది.

అసలేం జరిగిదంటే.. మార్చి 10న సోనెపట్‌లో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో బజ్‌రంగ్ సెమీఫైనల్లో ఓటమిపాలయ్యాడు. అనంతరం అతను డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడు. ఈ విషయమై కన్నేర్ర చేసిన నాడా బజ్‌రంగ్‌పై తాత్కాలిక సస్పెన్షన్ వేటు విధించింది.
అయితే డోపింగ్ టెస్టుకు శాంపిల్స్ ఇవ్వడానికి తానెప్పుడూ తిరస్కరించలేదని బజ్‌రంగ్ పునియా ఏడీడీపీకి వివరణ ఇచ్చాడు. పరీక్షల కోసం నాడా అధికారులు గడువు దాటిన కిట్‌లను వాడడంతోనే యూరిన్ శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరించానంటూ తెలిపాడు. అసలు ఎక్స్‌పైరీ అయిన కిట్‌లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించానని, కానీ నాడా ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని ఏడీడీపీతో పేర్కొన్నాడు.
బజరంగ్ పునియా వివరణతో ఏడీడీపీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నాడా తదుపరి నోటీసులు ఇచ్చేదాకా బజ్‌రంగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో బజ్‌రంగ్ పునియాకు నాడా ఛార్జ్ నోటీసులు పంపించిది. నిబంధనలు ఉల్లఘించాడంటూ సస్పెన్షన్‌ను తిరిగి విధించింది. కాగా, బజరంగ్ పునియా 2020 టోక్నో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. 65 కేజీల విభాగంలో ఫ్రీస్టైల్‌లో మెడల్ సాధించాడు.