
ఒకే స్కోర్ వద్ద 3 వికెట్లు డౌన్
నేడు ఉదయం 16-0తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు కాసేపటికే ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. జట్టు స్కోర్ 22 పరుగుల వద్ద ఉండగా 6 పరుగులు చేసిన హసీబ్ హమీద్‌ను బోల్డ్ చేశాడు. అనంతరం కాసేపటికే ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. 36 పరుగుల వద్ద 3 కీలక వికెట్లను కోల్పోయింది. 18 పరుగులు చేసిన ఓపెనర్ జాక్ క్రాలే బోలాండ్ బౌలింగ్‌లో ఔట్ కాగా, కెప్టెన్ జో రూట్ బోలాండ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. 3 పరుగులు మాత్రమే చేసిన మలాన్ గ్రీన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఆదుకున్న బెయిర్‌స్టో, స్టోక్స్
ఈ దశలో బెయిర్ స్టో, ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 128 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే జట్టు స్కోర్ 164 పరుగుల వద్ద ఉండగా 66 పరుగులు( 9 ఫోర్లు, ఒక సిక్స్) చేసిన స్టోక్స్‌ను స్పిన్నర్ లియాన్ ఔట్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన వికెట్ కీపర్ జోస్ బట్లర్ కమిన్స్ బౌలింగ్‌లో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తర్వాత మార్క్ వుడ్‌తో జత కట్టిన బెయిర్‌స్టో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు.
బెయిర్‌స్టో సెంచరీ
ఈ క్రమంలో బెయిర్‌స్టో తన టెస్టు కెరీర్‌లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. మార్క్ వుడ్‌తో కలిసి 72 పరుగులు జత చేశాక 39 పరుగులు చేసిన వుడ్‌ను జట్టు స్కోర్ 245 పరుగులు ఉండగా కమిన్స్ ఔట్ చేశాడు. 41 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో వుడ్ 39 పరుగులు చేశాడు. దీంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డ బెయిర్‌స్టో మూడో రోజును 258-7తో (70 ఓవర్లు) ముగించాడు. క్రీజులో బెయిర్‌స్టో (103 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్సులు), జాక్ లీచ్ (4) ఉన్నారు. నేటి ఆటలో మొత్తం 7 వికెట్లు కూలాయి. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ రెండేసి వికెట్లు, స్టార్క్, గ్రీన్, లయాన్ తలో వికెట్ తీశారు. మధ్యలో కాసేపు వర్షం అడ్డుపడడంతో పూర్తి ఆట సాధ్యపడలేదు.


Click it and Unblock the Notifications












