
ఐపీఎల్ ఆడేందుకు ఎంతో ఉత్సాహంగా దుబాయ్‌లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా కొన్ని వ్యక్తిగత కారణాలతో తిరిగి భారత్‌కు చేరుకున్నారు. అంతేకాదు ఈ ఏడాది ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. ఇదే విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ కేఎస్ విశ్వనాథన్ ధృవీకరించారు. ఈమేరకు చెన్నై సూపర్ కింగ్ ట్విటర్ వేదికగా రైనా ఐపీఎల్ సీజన్ 2020కి అందుబాటులో ఉండడని పేర్కొంది.
ఐపీఎల్ 2020 టైటిల్ రేసులో ఫేవరెట్‌గా ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ టోర్నీ ప్రారంభానికి ముందే సురేష్ రైనా దూరం కావడంతో షాక్ తగిలింది. అయితే రైనా వ్యక్తిగత కారణాలతోనే టోర్నీకి దూరమవుతున్నట్లు సమాచారం. కానీ ఆకారణాలేంటనేవి ఇంకా పూర్తిగా తెలియరాలేదు. గత కొద్దిరోజుల క్రితమే ఈ ఘజియాబాద్ కుర్రోడు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. అంతేకాదు జమ్మూ కశ్మీర్‌లో క్రికెట్ ప్రమోట్ చేసేందుకు స్వచ్చందంగా ముందుకొచ్చాడు. ఆ రాష్ట్రంలో క్రికెట్‌ను ఎంతగానో అభిమానిస్తూ క్రికెట్ ఆడాలనే బలమైన కోరిక కలిగి ఆ అవకాశాలు లేక వెనకనపడిపోయిన పిల్లలను గొప్ప క్రికెట్ క్రీడాకారుడిగా తీర్చి దిద్దాలని భావిస్తున్నాడు. తనవంతుగా క్రికెట్ క్రీడకు ఆణిముత్యాలను అందించాలని భావిస్తూ జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్‌కు లేఖ రాశాడు.
రైనా స్వతహాగా కశ్మీరీ పండిట్. తన తండ్రి త్రిలోక్ చంద్ జమ్మూకశ్మీర్‌కు చెందగా తల్లి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు చెందినది. 15 ఏళ్ల పాటు క్రికెట్‌లో రాణించి దేశానికి సేవ చేశానని చెప్పిన రైనా... క్రికెట్‌లో తాను నేర్చుకున్న మెలుకువలను మరో తరానికి నేర్పి గొప్ప క్రికెటర్లుగా తీర్చి దిద్దుతానని చెప్పుకొచ్చాడు. జమ్మూకశ్మీర్‌లోని నెపుణ్యం కలిగిన వారిని గుర్తించి వారిని మరింతగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో రైనా రేంజే వేరు. తాను బరిలోకి దిగినప్పుడు బాదే సిక్సులు చాలా చూడముచ్చటగా ఉంటాయి. ఆ షాట్స్ విమర్శకులను సైతం కట్టిపడేస్తాయి.