భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు బ్యాడ్ న్యూస్. న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరగనున్న చివరి వన్డే మ్యాచ్ తర్వాత ఈ స్టార్ జోడీ దాదాపు 6 నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున బరిలోకి దిగదు.
చివరి వన్డే పైనే అందరి కళ్లు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు(జనవరి 18, 2026) ఇండోర్ వేదికగా చివరి మ్యాచ్ జరగనుంది. రోహిత్, విరాట్ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారు కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత్ వరుసగా టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. కాబట్టి స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విరామంలో ఉండనున్నారు.

మళ్లీ ఎప్పుడు మైదానంలోకి వస్తారంటే?
ఐపీఎల్ 2026, టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మాత్రమే వీరు తిరిగి భారత జెర్సీలో కనిపిస్తారు. తాజా షెడ్యూల్ ప్రకారం.. జూన్ 2026లో అఫ్గానిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగే 3 వన్డేల సిరీస్‌లో రోహిత్, విరాట్ మళ్లీ ఆడే అవకాశం ఉంది. అయితే అప్పటి ఫామ్, సెలెక్టర్ల నిర్ణయంపైనే వీరి రీ-ఎంట్రీ ఆధారపడి ఉంటుంది.
రాబోయే వన్డే సిరీస్‌లు ఇవే (2026):
అఫ్గానిస్థాన్ సిరీస్ తర్వాత భారత్ బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంది. జులైలో ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా 3 వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ నెలలో వెస్టిండీస్ పర్యటనలో 3 వన్డేలు ఆడనుంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. బంగ్లాదేశ్ పర్యటన కూడా ప్రతిపాదించబడినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అది జరగడం కష్టంగా కనిపిస్తోంది.నేడు ఇండోర్‌లో జరిగే మ్యాచ్ రోహిత్-విరాట్ అభిమానులకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే మళ్లీ ఈ జోడీని టీమ్ ఇండియా నీలి రంగు జెర్సీలో చూడాలంటే జూన్ వరకు వేచి చూడాల్సిందే.