అగ్రరాజ్యం అమెరికా వేదికగా జరుగుతున్న మొట్టమొదటి మెగా క్రికెట్ టోర్నీ మేజర్ లీగ్ క్రికెట్‌లో ఎంఐ న్యూయార్క్ టీం అదరగొట్టింది. అద్భుతంగా ఆడి ఫైనల్ చేరుకుంది. ఛాలెంజర్ గేమ్ (ఐపీఎల్‌లో రెండో క్వాలిఫైయర్ వంటి మ్యాచ్)లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌ను ఎంఐ ఓడించింది. ఈ మ్యాచ్‌లో 'బేబీ ఏబీ' డెవాల్డ్ బ్రెవిస్ అదరగొట్టాడు.
ఇంత గొప్పగా ఆడుతున్న అతనికి మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇన్‌స్పిరేషన్ అని తెలుసా? ఈ విషయాన్ని బేబీ ఏబీనే స్వయంగా వెల్లడించాడు. ఎంఎల్‌సీలో తను వంద శాతం ఆడటానికి తిలక్ చాలా స్ఫూర్తినిచ్చాడని బ్రెవిస్ వెల్లడించాడు. టెక్సాస్‌పై అదరగొట్టిన బ్రెవిస్ 31 బంతుల్లో 44 పరుగులతో అజేయంగా నిలిచి ఎంఐని గెలిపించాడు.

'నేను ఈ సందర్భంగా నా ఫ్రెండ్ తిలక్ గురించి చెప్పాలి. ఇప్పుడు తను బార్బడోస్‌లో ఉండి ఉంటాడు. తను ఎప్పుడూ నాతో ఒక మాట చెప్తుంటాడు. ఎప్పుడు ఆడుతున్నా సరే.. నేను కచ్చితంగా ఈ మ్యాచ్ గెలిపిస్తా అంటుంటాడు. అలాగే ఆటను ఎంజాయ్ చేస్తూ పూర్తి ఎఫర్ట్ పెట్టాలని, టీం కోసం బాగా ఆడాలని చెప్తాడు' అని బ్రెవిస్ వెల్లడించాడు.
వీళ్లిద్దరూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. బ్రెవిస్ అయితే సౌతాఫ్రికా టీ20, ఎంఎల్‌సీలో కూడా ముంబై ఫ్రాంచైజీకే ఆడుతున్నాడు. తనకు యాజమాన్యంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని, వేరే డ్రెస్‌లో ఆడాలనే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు.
అంతేకాదు ముంబై ఫ్రాంచైజీ గ్లోబల్ హెడ్ ఆఫ్ పెర్ఫామెన్స్ మహేల జయవర్దనే ఇచ్చిన సలహా తన ఆటను మార్చిందని బేబీ ఏబీ చెప్పాడు. ఈ సలహాతో తన టెక్నిక్ చాలా మెరుగైందన్నాడు. 'కొన్ని రోజుల క్రితం మహేల జయవర్దనే నాతో మాట్లాడాడు. నా ట్రిగ్గర్‌తోపాటు చిన్న మూవ్‌మెంట్ సూచించాడు. అది నాకు బాగా కలిసొచ్చింది' అని నవ్వుతూ చెప్పాడీ ఫ్యూచర్ స్టార్.