టీ20 వరల్డ్ కప్‌కు సన్నాహకంగా ఇంగ్లండ్‌తో ఆడుతున్న టీ20 సిరీస్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అరుదైన రికార్డు సాధించాడు. మరో ఆరు రోజుల్లో టీ20 ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మహాసమరానికి సన్నద్ధమయ్యేలా ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్లు నాలుగు టీ20ల సిరీస్ ఆడుతోంది. మెగాటోర్నీకి ముందు ఇది మంచి ప్రాక్టీస్ అవుతుందని, జట్టు కూర్పును సిద్ధం చేసుకోవచ్చని ఇరు జట్లు భావిస్తున్నాయి.
అయితే సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. వరుణుడు తన ప్రతాపం చూపించడంతో కనీసం టాస్ కూడా పడలేదు. శనివారం జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 183 పరుగులు చేసింది. ఐపీఎల్ ఫామ్ కొనసాగిస్తూ కెప్టెన్ బట్లర్ (84; 51 బంతుల్లో, 8x4, 3x6) సత్తాచాటాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లు, ఇమాద్ వసీమ్, హారిస్ రవూఫ్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. టోప్లే మూడు వికెట్లు, మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫకర్ జమాన్ (45; 21 బంతుల్లో, 5x4, 3x6), బాబర్ అజామ్ (32; 26 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్లు. అయితే తన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించలేకపోయినప్పటికీ బాబర్ అరుదైన ఘనత సాధించాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా బాబర్ అజామ్ నిలిచాడు. అంతకుముందు ఈ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. 118 టీ20లు ఆడిన బాబర్ 41 సగటు, 129 స్ట్రైక్‌రేటుతో 3987 పరుగులు చేశాడు. హిట్‌మ్యాన్ 151 మ్యాచ్‌ల్లో 31 సగటు, 139 స్ట్రైక్‌రేటుతో 3974 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. 117 టీ20లు ఆడిన కోహ్లి 51 సగటు, 138 స్ట్రైక్‌రేటుతో 4037 పరుగులు చేశాడు.