
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ అప్రతిహత ఫామ్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ఎన్నో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన బాబర్ మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి వన్డేలో మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. 88 వన్డే ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా బాబర్ ఆజామ్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డ్ దక్షిణాఫ్రికా గ్రేట్ హషీమ్ అమ్లా పేరిట.. ఉండగా బాబర్ అతన్ని అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తన ఇన్నింగ్స్‌లో ఆరంభంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ బాబర్.. నిలదొక్కుకున్నాక తనదైన షాట్లతో అలరించాడు. తద్వారా మరో హాఫ్ సెంచరీ పేర్తి చేసుకున్నాడు. 74పరుగుల వద్ద అతను ఔటయ్యాడు. అయితే సెంచరీ వీరుడు ఫాఖర్ జమాన్‌తో కలిసి రెండో వికెట్‌కు 168పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని బాబర్ జోడించి జట్టుకు స్టాండిచ్చాడు. ప్రస్తుతం బాబర్ ఆజామ్ 88ఇన్నింగ్స్‌లలో 59.42సగటుతో 4516 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు 88ఇన్నింగ్స్‌లలో ఆమ్లా 4473పరుగులు చేశాడు. ఆమ్లా కంటే 43పరుగులు బాబర్ ఎక్కువ చేశాడు.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. నెదర్లాండ్ అసామాన్య పోరాటం కనబర్చింది. అయితే చివర్లో ఆ జట్టు తడబడడంతో కేవలం 16పరుగుల తేడాతో ఓటమిపాలయింది. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఇమాముల్ హక్ 2పరుగులకే ఔటయినప్పటికీ.. కెప్టెన్ బాబర్ ఆజం (85 బంతుల్లో 74, 6 ఫోర్లు, 1 సిక్సర్), ఫాఖర్ జమాన్ (109బంతుల్లో 109పరుగులు 12ఫోర్లు, 1సిక్సర్) పాక్ ఇన్నింగ్స్‌ను సరిచేశారు. చివర్లో షాదాబ్ ఖాన్ (28 బంతుల్లో 48 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6వికెట్ల కోల్పోయి 314పరుగులు చేసింది. ఇక 315పరుగుల ఛేదనలో పాకిస్థాన్ బౌలర్లను డచ్ బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. మన ఇండియన్ సంతతికి చెందిన కుర్రాడు విక్రమ్ జిత్ సింగ్ (65పరుగులు 98బంతుల్లో 5ఫోర్లు), టామ్ కూపర్ (65పరుగులు 54బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (71పరుగులు 60బంతుల్లో 6ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్) వీరోచితంగా పోరాడారు. చివరి మూడు ఓవర్లలో 41పరుగులు చేయాల్సి రావడంతో కేవలం 25పరుగులు మాత్రమే చేసి 298పరుగులకు నెదర్లాండ్స్ పరిమితమైంది. తద్వారా పాక్ 16పరుగుల తేడాతో గెలుపొందింది.