పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సారథి బాధ్యతలకు సెలవు అంటూ బాబార్ వీడ్కోలు చెప్పడం ఇది రెండో సారి. 2023 వన్డే వరల్డ్ కప్ ముగిసిన అనంతరం జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
అయితే టీ20 వరల్డ్ కప్ ముంగిట తిరిగి వైట్ బాల్‌కు బాబార్ అజామ్‌ను తిరిగి కెప్టెన్‌గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించింది. అయితే ఈ మెగాటోర్నీలో పాక్ ఘోర వైఫల్యాలను చవిచూసింది. అమెరికాతో చేతిలోనూ ఓటమిపాలై కనీసం గ్రూప్ స్టేజ్‌ను కూడా దాటలేకపోయింది. మరోవైపు కెప్టెన్సీ మార్పులపై పాకిస్థాన్ టీమ్‌లో ఐకమత్యం దెబ్బతిందని సమాచారం. ఆటగాళ్ల మధ్య గొడవలు మొదలయ్యాయని తెలిసింది.

ఈ క్రమంలో బాబార్ అజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించనున్నారని ప్రచారం కూడా మొదలైంది. అయితే బాబర్‌యే సారథి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బ్యాటింగ్‌పై మరింత దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ''డియర్ ఫ్యాన్స్..ఇవాళ మీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నా. గత నెలలో పాక్ బోర్డు, జట్టు మేనేజ్మెంట్‌కు ఈ నిర్ణయాన్ని తెలియజేశా''
''జట్టుకు సారథిగా ఉండటం ఎంతో గౌరవం. కానీ నా ఆటపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నా. కెప్టెన్సీ అనుభూతి ఓ బహుమతి. అలాగే పనిభారం కూడా పెరుగుతోంది. ఇక నా ప్రదర్శనకు ప్రాధాన్యత ఇస్తూ, కుటుంబంతో సమయాన్ని గడపాలని భావిస్తున్నా. మద్దతు ఇస్తూ, నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞుడిని. కలిసి సాధించిన ఘనతలను చూసి గర్వపడుతున్నా. ఇకపై ఆటగాడిగా జట్టుకు సహకారాన్ని కొనసాగించడానికి సంతోషిస్తున్నా. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు'' అని బాబర్ అజామ్ పేర్కొన్నాడు.
వన్డే వరల్డ్ కప్ తర్వాత టీ20లకు బాబర్ అజామ్ స్థానంలో షాహిన్ అఫ్రిదిని కెప్టెన్‌గా నియమించారు. కానీ అఫ్రిదికి కేవలం న్యూజిలాండ్ సిరీస్ వరకే ఛాన్స్ ఇచ్చారు. తిరిగి బాబర్‌ను సారథిగా ఎంపిక చేశారు. ఈ నిర్ణయం జట్టుపై ప్రభావం చూపించింది. కాగా, బాబర్ స్థానంలో మహ్మద్ రిజ్వాన్ జట్టు పగ్గాలు అందుకునే అవకాశం ఉంది.