Asia Cup 2022 Final : అదే మా కొంపముంచింది: ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్

అంచనాలు లేకుండా ఆసియా కప్ 2022 టోర్నీలో బరిలోకి దిగిన శ్రీలంక సంచలనం చేసింది. ఆఫ్ఘన్ చేతిలో ఘోర పరాజయంతో టోర్నీని ప్రారంభించిన శ్రీలంక.. తర్వాత ఓటమి అన్నదే లేకుండా టోర్నీ కడవరకు సాగి ట్రోఫీని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టి విజేతగా నిలిచింది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో 58పరుగులకే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డా హసరంగా(36, 3/27) ఆల్‌రౌండ్ ప్రదర్శనకు భానుక రాజపక్స(71 నాటౌట్) వీరోచిత పోరాటంతో 23పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(49 బంతుల్లో 55), ఇఫ్తికర్ అహ్మద్(31బంతుల్లో 32) తప్పా మిగిలినవారు తుస్సుమనిపించారు. హసరంగ 3వికెట్లకు తోడు మధుషాన్ నాలుగు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రాజపక్స నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా వనిందు హసరంగా నిలిచాడు.

ఆ రెండు భాగస్వామ్యాలను కట్టడి చేయలేక
ఇకపోతే ఫైనల్లో ఫేవరేట్ అంటూ జబ్బలు చరుచుకుంటూ బరిలోకి దిగిన పాకిస్థాన్ తేలిపోయింది. మ్యాచ్ ఆరంభంలో శ్రీలంక టాపార్డర్‌ను కుప్పకూల్చిన పాక్ బౌలర్లు.. తర్వాత చేతులెత్తేశారు. అదే ఇంటెన్సిటీని కొనసాగించలేకపోయారు. హసరంగా, రాజపక్స 58పరుగుల భాగస్వామ్యానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. తర్వాత కరుణరత్నే, రాజపక్స 54పరుగుల భాగస్వామ్యాన్ని కూడా కట్టడి చేయలేకపోయారు. దీంతో 120నుంచి 130లోపే కావాల్సిన స్కోరు ఏకంగా 170కి చేరుకుంది. మ్యాచ్ 18వ ఓవర్లో షాదాబ్ ఖాన్ రాజపక్స్ క్యాచ్ మిస్ చేయడం, 19వ ఓవర్ చివరి బంతికి ఆసిఫ్, షాదాబ్ కలిసి క్యాచ్ మిస్ చేయడంతో స్కోరు 150కి పరిమితం కావాల్సింది కాస్త 20పరుగులు అదనంగా వచ్చాయి. ఇక బ్యాటింగ్లోనూ రిజ్వాన్ టీ20 అనే సంగతి మర్చిపోవడం, మిడిలార్డర్ వైఫల్యం పాక్ ఓటమికి దారితీశాయి. ఈ మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబార్ ఆజామ్ తమ ఓటమికి గల కారణాలను తెలియజేశాడు.

మేం బానే ప్రారంభించాం కానీ..
'అత్యుత్తమ క్రికెట్ ఆడినందుకు శ్రీలంకకు అభినందనలు. మొదటి ఎనిమిది ఓవర్లలో మేము మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించాం, కానీ రాజపక్సా, హసరంగా నెలకొల్పిన భాగస్వామ్యం ఆ జట్టుకు చాలా కీలకమైంది. ఇది సరైన వికెట్, దుబాయ్‌లో ఆడడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. మా సామర్థ్యం మేరకు మేం బ్యాటింగ్ చేయలేదు. అదే మా కొంపముంచింది. మేము మ్యాచ్ బానే ప్రారంభించాము, కానీ చివర్లో 15-20 పరుగులు ఎక్కువ ఇచ్చాము. సరిగ్గా శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేయలేకపోయాం. అయినా ఈ టోర్నీ ద్వారా జట్టుగా మేం తీసుకోవాల్సిన సానుకూలాంశాలు చాలా ఉన్నాయి. ఫైనల్‌లో చిన్న చిన్న తప్పులే కీలకంగా మారతాయి. మా ఫీల్డింగ్ సరైన స్థాయిలో లేదు, బ్యాటింగ్ కూడా సరిగ్గా ముగింపునిచ్చేలా లేదు. ఈ టోర్నీ ద్వారా రిజ్వాన్, నసీమ్, నవాజ్ మాకు సానుకూలాంశాలుగా ఉన్నారు. ఏదేమైనా ఆటలో హెచ్చు తగ్గులు ఉంటాయి, తప్పులు ఎవరైనా చేస్తారు.. కానీ మేం మరింత తక్కువ తప్పులు చేస్తే బాగుంటుంది.' అని బాబర్ పేర్కొన్నాడు.

తుది జట్లు
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), దనుష్క గుణతిలక, ధనంజయ డిసిల్వా, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), ఫాఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దీల్ షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications