Babar Azam on Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ కఠిన చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. సింధు జలాల ఒప్పందం రద్దు సహా దాయాది దేశంపై అనేక ఆంక్షలు విధించింది. ఇంకా పాకిస్థాన్ కు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను కూడా భారత్ లో బ్లాక్ చేస్తోంది. ఇప్పటికే పాక్ క్రికెటర్లు,ఇతర ఆటగాళ్లకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లను, సామాజిక ఖాతాలను నిషేధించిన భారత్.. ఇందులో భాగంగానే బాబర్ అజామ్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా బంద్ చేసింది.
భారత్ నా రెండో ఇల్లు..
అయితే తాజాగా పహల్గాం ఉగ్రదాడిని ఉద్దేశించి బాబార్ అజామ్ చేసిన ఓ ఇన్ స్టా పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో అతడు ఇండియాకు మద్దతుగా నిలుస్తూ, పాకిస్థాన్ ఆర్మీపై తీవ్రంగా మండిపడినట్టు రాసి ఉంది. "ఓ క్రికెటర్ గా నేనెప్పుడు భారత్ లో, భారత్ తో ఆడటానికి ఎంతో ఇష్టపడతాను. భారత్ నా రెండో ఇళ్లు లాంటిది. దురదృష్టవశాత్తు నా ఇన్ స్టా అకౌంట్ భారత్ లో బ్యాన్ అయింది. నేనొక్కటి చెప్పాలనుకుంటున్నాను. పహాల్గాం దాడిలో క్రికెటర్లు పాల్గొనలేదు."

పాకిస్థాన్ ఆర్మీ చేస్తోన్న రాజకీయం ఇది..
"పాకిస్థాన్ ఆర్మీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ వల్ల దక్కిన ఫలితం ఇది. నేను పేర్లు చెప్పను, కానీ పాకిస్థాన్‌లో అధికారాన్ని ఎవరు నడిపిస్తున్నారో, తీవ్రవాదానికి రక్షణ కల్పిస్తూ, ఎవరు మద్దతిస్తున్నారో అందరికీ తెలుసు. పాకిస్థాన్ ఆర్మీకి ఒక సందేశం. మీ చర్యల వల్ల నిర్దోషులైన పాకిస్థానీ పౌరులు బాధపడుతున్నారు. దయచేసి తీవ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని నిలిపేయండి." అని బాబార్ పోస్ట్ లో రాసి ఉంది. అయితే ఈ పోస్ట్ వైరల్ అయిన కాసేపటికి చాలా మంది నిజం అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఇది ఫేక్ పోస్ట్ అని తెలిసింది. ఎవరో బాబర్ అజామ్ పేరుతో కావాలనే పోస్ట్ చేసినట్లు సమాచారం అందింది.