పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం మరోసారి విమర్శల పాలవుతున్నాడు. టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో బాబర్ ఆజం జిడ్డు బ్యాటింగ్‌తో జట్టును ముంచేశాడు. జట్టుకు వేగంగా పరుగులు కావాల్సిన సమయంసో బాబర్ ఆజం కేవలం 24 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లండ్ బౌలర్ జేమీ ఓవర్టన్ వేసిన అద్భుతమైన బంతికి బాబర్ ఆజం క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఒత్తిడిలో విఫలమైన బాబర్ ఆజం
ఓపెనర్ సైమ్ అయూబ్ త్వరగా ఔట్ కావడంతో బాబర్ ఆజంపై భారీ బాధ్యత పడింది. కానీ క్రీజులో సెటిల్ అయినప్పటికీ బాబర్ ఆజం స్కోరు బోర్డును పరిగెత్తించలేకపోయాడు. కేవలం 104 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన బాబర్, ఇన్నింగ్స్ వేగాన్ని పెంచే క్రమంలో వికెట్ పారేసుకున్నారు. ఆధునిక టీ20 క్రికెట్‌లో 140-150 స్ట్రైక్ రేట్ కనీస అవసరంగా మారిన తరుణంలో, బాబర్ ఇలా టెస్ట్ తరహాలో ఆడటం పాక్ అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోంది.

అవమానకరమైన రికార్డులో టాప్!
ఈ ఇన్నింగ్స్‌తో బాబర్ ఆజం టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఒక అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ ఆజం ఇప్పుడు అత్యల్ప స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఆయన తన స్వదేశీ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కరలను వెనక్కి నెట్టి ఈ అవమానకర జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నారు.
కుంటుపడుతున్న స్ట్రైక్ రేట్
బాబర్ ఆజం కెరీర్ మొత్తం మీద టీ20 వరల్డ్ కప్‌లో అతని స్ట్రైక్ రేట్ 111 వద్దే ఉంది. కీలకమైన నాకౌట్ లేదా సూపర్-8 మ్యాచ్‌ల్లో ఇంత నెమ్మదిగా ఆడటం జట్టుకు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తోంది. బాబర్‌కు వరుస అవకాశాలు ఇవ్వడం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ గొయ్యి తామే తవ్వుకుంటోందని క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు.