
కరాచీ: టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో పర్వాలేదు కానీ.. టీ20ల్లో మాత్రం పాకిస్తాన్ కొత్త కెప్టెన్ బాబర్ అజామ్ సుదీర్ఘకాలం ఆడలేడని ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో బాబర్ ఎక్కువ రోజులు రాణించలేడని.. వన్డే, టెస్టుల్లో మాత్రం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలడు అని అఫ్రిదీ పేర్కొన్నాడు. పాకిస్థాన్ క్రికెట్‌లో గత రెండేళ్లుగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాబర్‌దే. వన్డే, టెస్టులతో పాటు టీ20ల్లోనూ నిలకడగా రాణిస్తున్న ఇతగాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని తలపిస్తున్నాడు.
తాజాగా షాహిద్ అఫ్రిదీ మాట్లాడుతూ... 'నా అభిప్రాయం ప్రకారం.. టీ20ల్లో బాబర్ అజామ్ ఎక్కువ రోజులు రాణించలేడు. వన్డే, టెస్టుల్లో మాత్రం ఆధిపత్యాన్ని ప్రదర్శించగలడు. రోజు రోజుకి బాబర్ ఒక క్రికెటర్‌గా చాలా మెరుగవుతున్నాడు. అతని షాట్లు చూస్తే అర్ధమయిపోతుంది. కేవలం అతని హార్డ్‌వర్క్ ద్వారానే అది సాధ్యమవుతోంది. నేను ఏబీ డివిలియర్స్ లేదా విరాట్ కోహ్లీ అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటే ప్రయోజనం ఉండదు. లక్ష్యాల్ని పెట్టుకుని దానికి తగినట్లు కష్టపడాలి' అని అన్నాడు.
'ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీమ్ అంటే చాలా ఇష్టం. బాగా ఆడుతున్నారు. షాదాబ్ ఖాన్ మంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగే అవకాశం ఉంది. అలాగే ఇమాద్ వసీమ్‌కు కూడా ఆ సామర్థ్యం ఉంది. పేసర్ హసన్ అలీ కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆల్‌రౌండర్ అంటే పాక్ జట్టుకు ఎక్కువ విజయాలను అందించాలి. ఆల్‌రౌండర్‌కు ఎంతో విలువ ఉంటుంది' అని షాహిద్ అఫ్రిదీ వెల్లడించాడు.
2015లో పాకిస్థాన్ జట్టులోకి వచ్చిన బాబర్ అజామ్ ఇప్పటి వరకూ 26 టెస్టులాడి 45.12 సగటుతో 1,850 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 74 వన్డేల్లో 54.18 సగటుతో 3,359 పరుగులు చేసాడు. వన్డేల్లో 11 శతకాలు, 15 అర్ధ శతకాలు సాధించాడు. ఇక 38 టీ20లు ఆడి 50.72 సగటుతో 1,471 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం బాబర్ అజామ్ వయసు 25 ఏళ్లు కాగా.. ఈ వయసులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గణాంకాలు ఇలా లేవు. మొత్తంగా మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీ తర్వాత అత్యంత నిలకడగా రాణిస్తున్న క్రికెటర్ బాబర్ మాత్రమే.
గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న బాబర్ అజామ్‌ని పాకిస్థాన్ అభిమానులు ముద్దుగా.. పాక్ 'విరాట్ కోహ్లీ' అని పిలుచుకుంటారు. అక్కడితో ఆగకుండా కోహ్లీని మించిపోయాడని కామెంట్లు చేస్తారు. అయితే 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న కోహ్లీతో కేవలం ఐదేళ్ల నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న బాబర్‌ని పోల్చడం సరికాదని కొందరు అంటున్నారు. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అజామ్ అగ్రస్థానంలో ఉండగా.. వన్డేలలో 3, టెస్టులలో 5వ స్థానంలో ఉన్నాడు.