పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా న్యూజిల్యాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చెలరేగాడు. కేవలం 58 బంతుల్లోనే 101 పరుగులతో అజేయంగా నిలిచి, తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ 11 ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ఇన్నింగ్స్ చివరి బంతికి బౌండరీ బాదిన బాబర్.. తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఈ క్రమంలో టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డులు కూడా బద్దలుకొట్టాడు. కివీస్‌పై బాదిన సెంచరీ బాబర్ టీ20 కెరీర్‌లో మూడోది. ఈ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్‌గా రోహిత్ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. అంతేకాదు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో కూడా జాయింట్ సెకండ్ పొజిషన్ చేరుకున్నాడు.

ఈ జాబితాలో అతనితోపాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, కోలిన్ మున్రో, సూర్యకుమార్ యాదవ్ కూడా మూడేసి సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. టాప్ ప్లేస్‌లో నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఇది బాబర్‌కు 9వ సెంచరీ. వీటిలో ఆరు శతకాలు కెప్టెన్‌గా చేసినవే. ఈ క్రమంలో కెప్టెన్‌గా అత్యధిక టీ20 సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ రికార్డును కూడా బాబర్ బద్దలు కొట్టారు. వీళ్లిద్దరూ కెప్టెన్లుగా పొట్టి ఫార్మాట్‌లో ఐదు సెంచరీలు చేశారు. ఆస్ట్రేలియా ప్లేయర్ మైఖేల్ క్లింగర్ (7) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
ఓవరాల్‌గా బాబర్ మొత్తం 9 టీ20 శతకాలు సాధించాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ల జాబితాలో విండీస్ విధ్వంసం క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో గేల్ మొత్తం 22 శతకాలు చేశాడు. రెండో స్థానానికి ఎగబాకిన బాబర్ 9 శతకాలతో ఉండగా.. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ చెరో 8 శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు.