
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరికీ దిమ్మతిరిగే షాక్ తగిలింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న వీళ్లిద్దర్నీ కొనేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ ఘటన 'ది హండ్రెడ్' లీగ్‌లో వెలుగు చూసింది. ఈ లీగ్ కోసం జరిగిన డ్రాఫ్టింగ్‌లో బాబర్ ఆజమ్ లక్ష యూరోల ధరతో బరిలో దిగాడు. అయితే అతన్ని కొనేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు.
ఇక ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2023లో మహమ్మద్ రిజ్వాన్ ఎలా చెలరేగాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ లీగ్‌లో అద్భుతంగా ఆడిన అతను 12 మ్యాచుల్లోనే 550 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. బాబర్ ఆజమ్ కూడా ఈ లీగ్‌లో ఆకట్టుకున్నాడు. మొత్తం 11 మ్యాచులు ఆడిన అతను 522 పరుగులు నమోదు చేశాడు. ఈ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో వీళ్లిద్దరే ఉన్నారు.
దీంతో వీళ్లిద్దరికీ హండ్రెడ్‌లో మంచి ధర పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. బాబర్‌తోపాటు రిజ్వాన్‌ను కొనేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఇది వీళ్లిద్దరికీ గట్టి షాక్ అని చెప్పక తప్పదు. ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్' లీగ్‌లో 8 జట్లు తలపడతాయి. వీటి కోసం జరిగిన డ్రాఫ్ట్‌లోనే బాబర్, రిజ్వాన్‌లకు మొండి చెయ్యి చూపించారు. హండ్రెడ్ లీగ్‌లో జట్టు విజయం ప్రధానంగా భారీ షాట్లపై ఆధార పడి ఉంటుందని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
ఒక విధంగా టీ20 స్పెషలిస్టులకే హండ్రెడ్ లీగ్‌లో ప్రాధాన్యం లభిస్తుంది. కానీ బాబర్, రిజ్వాన్ ఇద్దరూ కూడా నెమ్మదిగా తమ ఇన్నింగ్స్ నిర్మిస్తారే తప్ప.. తొలి బంతి నుంచి విరుచుకు పడే వారు కాదు. అందుకే ఎవరూ వీరిపై ఇంట్రస్ట్ చూపించలేదు. ఇది చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇది జింబాబర్ కథ అంటూ కొంత మంది వెటకారం ఆడుతున్నారు.
బాబర్ హాఫ్ సెంచరీ చేయాలంటేనే 100 బంతులు కావాలి, ఇక్కడేమో అప్పటికి మ్యాచ్ ముగిసిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాబర్, రిజ్వాన్‌లను తెగ ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.