
వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ స్టోక్స్ నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపించాడు. అతనో నిస్వార్థపూరిత ప్లేయర్ అని కొనియాడాడు. అతనికి జట్టే తొలి ప్రాధాన్యమని అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పాడు. ఇక స్టోక్స్ చివరగా డర్హామ్‌లోని చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డేలో ఆడబోతున్నాడు. ఇక 2011లో ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేసిన స్టోక్స్ 11ఏళ్ల పాటు జట్టులో కొనసాగాడు. లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన 2019ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చి క్రికెట్ ప్రపంచం మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు.
ఇక అజారుద్దీన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. 31ఏళ్ల స్టోక్స్ ఎల్లప్పుడూ తన వ్యక్తిగత విజయాల కంటే జట్టు విజయాలే ప్రథమం అని భావించే వ్యక్తి అని కొనియాడాడు. 'ఒక ప్లేయర్‌గా తన బాడీ పరిస్థితిని అతను అర్థం చేసుకున్నట్లు ఎవరూ అర్థం చేసుకోరు. ఇంగ్లాండ్ క్రికెట్‌కు తన ఉత్తమమైన సేవలను అందించిన గొప్ప ఆటగాడి నుంచి ఇది మంచి ఆలోచన. ఇదో నిస్వార్థ నిర్ణయం. #బెన్‌స్టోక్స్.' ఇకపోతే స్టోక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయం విషయమై సుదీర్ఘ లేఖ కూడా రాశాడు. జాతీయ జట్టు కోసం అన్ని ఫార్మాట్లలో 100శాతం ప్రయత్నాలు చేయడం తనకు చాలా కష్టంగా మారిందని చెప్పాడు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో స్టోక్స్ మూడు మ్యాచ్‌లలో కేవలం 48పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
2011లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన స్టోక్స్ ఇప్పటి వరకు 104 వన్డే మ్యాచ్‌లు ఆడి 39.44 సగటుతో 2919 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్‌లో 74వికెట్లు కూడా తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో 84పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్టోక్స్ 3-0తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.