హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరిస్‌కు ప్రధాన స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు విశ్రాంతి కల్పించడంపై మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్పిన్ పిచ్‌లపై ప్రభావం చూపే ఇద్దరు స్పిన్నర్లను విశ్రాంతిని కారణంగా చూపుతూ పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సెలక్షన్ కమిటీని ప్రశ్నించాడు.
భారత్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా సెప్టెంబర్ 17న తొలి వన్డే జరగనుంది. ఇందుకు సంబంధించి తొలి మూడు వన్డేలకు బీసీసీఐ సెలక్టర్లు భారత జట్టుని ఇప్పటికే ప్రకటించారు.

సెలక్టర్లు ప్రకటించిన జట్టులో భారత ప్రధాన స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లకు చోటు కల్పించారు. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ స్పందించాడు. 'శ్రీలంక సిరిస్‌కు అశ్విన్, జడేజాకు విశ్రాంతి ఇచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియా లాంటి జట్టుతో ఆడేటప్పుడు అత్యుత్తమ స్పిన్నర్లను జట్టుకు ఎంపిక చేయాలి' అని అన్నాడు.
'దీనికి తోడు సొంతగడ్డపై పిచ్‌లన్నీ స్పిన్‌కు బాగా సహకరిస్తాయి. అలాంటప్పుడు వారిని తప్పించి ఆసీస్‌కు పుంజుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి. అశ్విన్.. కౌంటీల్లో ఆడటం బాగానే ఉంది. కానీ నేనే కెప్టెన్ అయితే అశ్విన్, జడేజాను కచ్చితంగా జట్టులోకి తీసుకునేవాడిని. సొంతగడ్డపై గాకుండా విదేశాల్లో ఆడినప్పుడు భారత జట్టు సత్తా ఏంటో తెలుస్తుంది' అని పేర్కొన్నాడు.