హైదరాబాద్: పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మెన్ అజహర్ అలీ వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. గురువారం దుబాయిలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్‌తో సమావేశమైన తర్వాత అలీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విఫలం కావడంతో పాకిస్థాన్ వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించాడు. జట్టుకు సారథ్యం వహించడం వల్ల బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతోందని, ఈ ఒత్తిడి వల్లే బ్యాట్స్‌మన్‌గా రాణించలేకపోతున్నాననే కారణంతో కెప్టెన్సీని వదులుకున్నట్లు అలీ పేర్కొన్నాడు.

కాగా, అలీ స్థానంలో వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా సర్ఫరాజ్‌కు బాధ్యతలు అప్పగించారు. అలీ వైదొలగడంపై షహర్యార్ స్పందించాడు. 'ఈరోజు అజహర్ నన్ను కలిశాడు. కెప్టెన్సీ బాధ్యత తన వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపుతున్నదనీ, అందుకే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు అజర్ తెలిపాడు. ఇందుకు మేం కూడా అంగీకరించాం. వన్డే జట్టు పగ్గాలు స్వీకరించాల్సిందిగా సర్ఫరాజ్ అహ్మద్‌ను కోరడంతో అతను ఒప్పుకున్నాడు' అని షహర్యార్ అన్నాడు.
వికెట్‌కీపర్, బ్యాట్స్‌మన్ అయిన సర్ఫరాజ్ ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇంతకముందు ఓ వన్డే, నాలుగు టీ20లకు పాకిస్థాన్ జట్టుకు నాయకత్వం వహించాడు. కాగా, మూడు ఫార్మాట్లకు ఒకరినే కెప్టెన్‌గా నియమించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇటీవలే టెస్టు కెప్టెన్ మిస్బా ఉల్ హక్‌ను కూడా తప్పించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే ఇందుకు మిస్బా ససేమేరా అన్నాడు. ఈ నేపథ్యంలో మిస్బాపై కూడా పీసీబీ వేటు వేస్తుందా లేక అతన్నే కెప్టెన్ గా కొనసాగిస్తుందా? అన్నది వేచిచూడాలి. మిస్బా ఉల్ హక్, తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరాడని షహర్యార్ చెప్పాడు.