మలుపు తిప్పిన నిర్ణయం.. గెలిపించిన త్యాగం!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓ ఆసక్తికరమైన వ్యూహాన్ని అమలు చేసింది. హాఫ్ సెంచరీతో మంచి ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ ఆయుష్ మాత్రేను 18వ ఓవర్లో 'రిటైర్డ్ అవుట్'గా వెనక్కి పిలిపించి.. హిట్టర్ శివం దూబేను బరిలోకి దించింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా అర్థ శతకం చేసిన తర్వాత రిటైర్డ్ అవుట్ అయిన రెండో సీఎస్కే ప్లేయర్‌గా ఆయుష్ మాత్రే నిలవడం గమనార్హం.
ఆయుష్ మాత్రే వివరణ
మ్యాచ్ అనంతరం ఈ నిర్ణయంపై ఆయుష్ మాత్రే స్పందిస్తూ.. ఇందులో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశాడు. "జట్టుకు ఆ సమయంలో భారీ షాట్లు అవసరం. నేను అప్పటికే 36 బంతుల్లో 59 పరుగులు చేసి ఉన్నాను, కానీ చివరి ఓవర్లలో ఆశించిన స్థాయిలో వేగంగా ఆడలేకపోయాను. శివం దూబే మొదటి బంతి నుంచే భారీ సిక్సర్లు కొట్టగలడు. అందుకే మేనేజ్‌మెంట్ ఈ ప్లాన్ చేసింది. జట్టు ప్రయోజనాల కోసం ఇలాంటివి సహజం" అని ఆయుష్ మాత్రే పేర్కొన్నాడు.

మలుపు తిప్పిన భాగస్వామ్యం
తొలి ఓవర్లోనే రుతురాజ్ గైక్వాడ్ ఔట్ అయిన తర్వాత, సంజూ శాంసన్‌తో కలిసి ఆయుష్ మాత్రే రెండో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఢిల్లీపై సీఎస్కే చరిత్రలో ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. వీరిద్దరి నిలకడైన ఆట వల్లే చెన్నై 212 పరుగుల భారీ స్కోరును అందుకోగలిగింది. సీఎస్కే జట్టు వాతావరణం గురించి మాట్లాడుతూ.. "ఇక్కడ అందరూ నన్ను ఓ చిన్న పిల్లాడిలా చూసుకుంటారు. సపోర్ట్ స్టాఫ్, సీనియర్ ఆటగాళ్లు చాలా అండగా నిలుస్తున్నారు. ఇదొక కుటుంబంలా అనిపిస్తుంది," అని ఆయుష్ సంతోషం వ్యక్తం చేశాడు.
విజయ తీరాలకు:
ఆయుష్ మాత్రే తప్పుకోవడంతో బరిలోకి దిగిన శివం దూబే మెరుపులు మెరిపించడంతో సీఎస్కే స్కోరు 200 దాటింది. 213 పరుగుల లక్ష్యంతో దిగిన ఢిల్లీని 189 పరుగులకే కట్టడి చేయడంతో చెన్నై ఈ సీజన్‌లో తన తొలి విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వే వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు ఆయుష్ మాత్రే కూడా రిటైర్డ్ ఔట్ జాబితాలో చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications