ఆసియా కప్ 2025లో ఆడబోయే భారత జట్టుపై అప్పుడే అసహనం, అసంతృప్తి చెలరేగింది. భారత జట్టులో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి ఆకస్మికంగా తొలగించడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. "అక్షర్ పటేల్ ఎలాంటి తప్పు చేయలేదు. అతడిని వైస్-కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించారో సరైన వివరణ ఇవ్వాలి" అని మహ్మద్ కైఫ్ సెలెక్టర్లను డిమాండ్ చేశారు.
సెలెక్టర్ల నిర్ణయంపై సందేహాలు
ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు వైస్-కెప్టెన్‌గా శుభమన్ గిల్‌ను ఎంపిక చేశారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అక్షర్ పటేల్ భారత జట్టుకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరించారు. అక్షర్ పటేల్‌ను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వైస్ కెప్టెన్ బాధ్యత నుంచి తొలగించి.. ఒక సంవత్సరం పైగా టీ20 జట్టులో లేని శుభ్‌మన్ గిల్‌కు ఈ బాధ్యతను అప్పగించడం సెలెక్టర్ల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఈ నిర్ణయంపై మహ్మద్ కైఫ్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. "వైస్-కెప్టెన్సీ నుంచి తొలగించిన విషయం గురించి సెలక్షన్ కమిటీ అక్షర్ పటేల్‌కు ముందుగానే తెలియజేసి ఉంటుందని ఆశిస్తున్నాను. ప్రెస్ కాన్ఫరెన్స్ చూసి అతడు ఈ విషయం తెలుసుకుని ఉండకూడదు. అక్షర్ ఎలాంటి తప్పు చేయలేదు, కాబట్టి అతడికి దీనిపై వివరణ ఇవ్వాలి" అని ఘాటుగా పోస్ట్ చేశారు.
అక్షర్‌కు సరైన గౌరవం లేదా?
ఇటీవలి కాలంలో అక్షర్ పటేల్ భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా మారారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అతను నిలకడగా రాణిస్తున్నారు. ముఖ్యంగా, 2024 టీ20 ప్రపంచ కప్‌ను గెలిచిన భారత జట్టులో అక్షర్ పాత్ర చాలా కీలకమైనది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అంతేకాకుండా 2025 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. ఇంత అద్భుతమైన ప్రదర్శన తర్వాత కూడా అతడికి సరైన గౌరవం లభించలేదన్న ఆవేదన మాజీ ఆటగాళ్లు, అభిమానుల మధ్య వ్యక్తమవుతోంది. అక్షర్ ను వైస్-కెప్టెన్సీ నుంచి తొలగించడం, ఆటగాళ్ల మధ్య నిరాశను సృష్టించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెలక్షన్ కమిటీ తన నిర్ణయానికి సరైన కారణాన్ని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.